జాతీయ రహదారులపై ఎయిర్‌స్ట్రిప్స్‌ను (రన్‌వేలు) అందుబాటులోకి తెస్తామని కేంద్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. మొత్తం 28 జాతీయ రహదారులపై ఎమర్జెన్సీ రోడ్డు-కం-రన్‌వే నిర్మించాలని నిర్ణయించామని చెప్పారు. అందులో నెల్లూరు-ఒంగోలు, ఒంగోలు-చిలకలూరిపేట రహదారులున్నట్లు వెల్లడించారు. మంగళవారం రోజు లోక్‌సభలో తన శాఖ బడ్జెట్ పద్దులపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘చాలాచోట్ల 300 కిలోమీటర్ల వరకు ఎలాంటి ఎయిర్ పోర్టులు లేవు. అందువల్ల విమానాలు దిగేలా ఎయిర్ స్ట్రిప్‌లను రోడ్డు, రవాణాశాఖ ఆధ్వర్యంలో ఉచితంగా నిర్మిస్తాం. పౌర విమానయానశాఖ వారు రోడ్డు పక్కనే రూ.3-4 కోట్లతో ఎయిర్ పోర్టు భవనం నిర్మిస్తే సరిపోతుంది. విమానాలు రాకపోకలు సాగించేటప్పుడు రోడ్డు ట్రాఫిక్‌ను కొంతసేపు ఆపేస్తాం. ఈ స్ట్రిప్‌లపై లైట్లు ఏర్పాటు చేస్తే రాత్రిపూట ల్యాండింగ్ సాధ్యమవుతుంది’ అని ప్రకటించారు.
జాతీయ రహదాలపై ప్రతి మూడు మీటర్లకు ఒక మొక్క నాటాలనే నియమం తీసుకొచ్చాక రాజమండ్రి పరిసరాల్లో నర్సరీలకు విపరీతమైన డిమాండు పెరిగిందని తెలిపారు. ఈ చర్చ సందర్భంగా భువనగిరి (తెలంగాణ) ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ... తెలంగాణలో దేశంలోనే అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ లెక్కలు చెబుతున్నాయని, అందులోనూ హైదరాబాద్- విజయవాడ మధ్య అత్యధికంగా జరుగుతున్నాయని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. 2022 ఏప్రిల్ కల్లా ఈ మార్గాన్ని కాంట్రాక్టు సంస్థ జీఎంఆర్ 4 నుంచి 6 వరుసలకు విస్తరించాల్సి ఉన్నప్పటికీ చేయలేదని గుర్తు చేశారు. గడ్కరీ స్పందిస్తూ.. ‘నేను ఆ కాంట్రాక్టు సంస్థను పిలిచి మాట్లాడా. ఏం చెప్పాలో అది చెప్పా. విషయం హైకోర్టు, సుప్రీంకోర్టులదాకా వెళ్లడంతో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. వచ్చే సోమ, మంగళవారాల్లో సమస్యను పరిష్కరిస్తాం’ అని హామీ ఇచ్చారు.
టోల్ వసూలుకు జీపీఎస్ విధానం
భవిష్యత్తులో జీపీఎస్ విధానంలో టోల్ వసూలు చేస్తామని, ప్రస్తుతమున్న టోల్‌గేట్లను తొలగిస్తామని మంత్రి గడ్కరీ ప్రకటించారు. జీపీఎస్ సిగ్నల్ ద్వారా వాహనం ఎప్పుడు రోడ్డుమీదకు వచ్చి ఎంత దూరం ప్రయాణించిందో లెక్కించి ఆటోమేటిక్‌గా బ్యాంకు ఖాతా నుంచి డబ్బు వసూలు అయ్యేలా చేస్తామని వెల్లడించారు. సేతు భారతం కింద దేశ వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లు, రాష్ట్ర రహదారుల్లో రూ.8వేల నుంచి రూ.10 వేల కోట్లతో రైల్వే గేట్లను తొలగించడానికి వీలుగా వంతెనలను తమ శాఖ తరఫున ఉచితంగా నిర్మిస్తామని ప్రకటించారు.
ఇదీ చదవండి: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎంపీల సంతకాలు సేకరణ: వైకాపా