అంతర్రాష్ట్ర ఒప్పందంపై చర్చించేందుకు హైదరాబాద్‌లో నేడు ఏపీఎస్ఆర్టీసీ, తెలంగాణ ఆర్టీసీ ఎండీలు తుది దఫా సమావేశం జరపనున్నారు. ఖైరతాబాద్‌లోని రవాణాశాఖ కార్యాలయంలో మధ్యాహ్నం ఈ భేటీ జరగనుంది. ఏపీఎస్ఆర్టీసీ సీఎండీ కృష్ణబాబు, ఆపరేషన్స్ ఈడీ, సీటీఎంలతో పాటు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, టీఎస్ఆర్టీసీ సీఎండీ సునీల్ శర్మ, ఆపరేషన్స్ ఈడీ, సీటీఏ ఈ సమావేశంలో పాల్గొంటారు. ఇప్పటికే ఇరు రాష్ట్రాల ఆర్టీసీలు తిప్పే కిలోమీటర్లపై ఏకాభిప్రాయం కుదిరింది. చెరో లక్ష 60 వేల కిలోమీటర్ల మేరకు బస్సులు తిప్పాలని నిర్ణయించారు. ఏ రూట్లలో ఎవరు ఎన్ని బస్సులు తిప్పాలనే విషయమై ప్రతిపాదనలు తయారు చేశారు. వీటిపై ఈడీ స్థాయి అధికారులు ఇప్పటికే చర్చించి సానుకూలత వ్యక్తం చేశారు. నేటి సమావేశంలో వీటన్నింటిపై ఎండీల స్థాయిలో మరోసారి చర్చించి ప్రతిపాదనలపై ఆమోద ముద్ర వేసే అవకాశాలున్నాయి. అనంతరం ఇరు రాష్ట్రాల ఎండీలు అంతర్రాష్ట్ర ఒప్పందంపై సంతకాలు చేస్తారని సమాచారం.
ఇప్పటి వరకు 4 సార్లు ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ అధికారులు అంతరాష్ట్ర బస్సు సర్వీసుల పునరుద్ధరణపై సమావేశమయ్యారు. సమాన కిలోమీటర్లు, సమాన బస్సులు, సమాన రూట్లలో బస్సులు తిప్పాలని ఏపీఎస్ఆర్టీసీకి టీఎస్ఆర్టీసీ ప్రతిపాదనలు చేసింది. ఏపీఎస్ఆర్టీసీ 1.61లక్షల కిలోమీటర్లు తిప్పేందుకు అంగీకరించింది.. ప్రధాన రూట్లైన హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-గుంటూరు తదితర రూట్లలో టీఎస్ఆర్టీసీకి ఎక్కువగా లాభాలు వస్తాయి. ఈ రూట్లలో టీఎస్ఆర్టీసీ వీలైనన్ని ఎక్కువ కిలోమీటర్లు, ఎక్కువ బస్సులు తిప్పుతామని చెప్పింది. ఇక్కడే ఏపీ అధికారులు సందిగ్ధంలో పడ్డారు. ఇవాళ్టి భేటీలో పూర్తి స్పష్టత వచ్చే అవకాశముంది. ఒప్పందం కుదిరిన వెంటనే ఏపీలోని పలు జిల్లాల నుంచి హైదరాబాద్ సహా తెలంగాణ ప్రాంతాలకు బస్సులు ప్రారంభం కానున్నాయి. వెంటనే బస్సులు తిప్పేందుకు సిద్ధంగా ఉండాలని అన్ని జిల్లాల అధికారులకు ఏపీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. చర్చలు సఫలమైతే ఈరోజు రాత్రి నుంచే తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని అధికార వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండీ... ప్రభుత్వ ఉదాసీనతే పోలవరానికి శాపం: చంద్రబాబు