పెద్దఎత్తున సిబ్బంది కరోనా బారిన పడుతున్న దృష్ట్యా.. వారి ప్రాణాలు కాపాడేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌కు ఆర్టీసీ కార్మికులు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేస్తూ ముఖ్యమంత్రికి ఆర్టీసీ ఎన్ఎంయూ లేఖ రాసింది. ఇప్పటి వరకు 9,200 మంది కార్మికులకు కొవిడ్ సోకిందని.. మొత్తం ఉద్యోగుల్లో 18 శాతం మందికి వైరస్ నిర్ధరణ జరిగిందని యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రమణారెడ్డి తెలిపారు. 240 మంది ఉద్యోగులు మృతిచెందారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం సంస్థలో 50 శాతం సిబ్బందికి సైతం వాక్సిన్ వేయలేదని వెల్లడించారు. ఉద్యోగులు, వారి కుటుంబాలకు వెంటనే టీకా ఇచ్చేందుకు ఆదేశాలివ్వాలని విన్నవించారు.
ఇదీ చదవండి: కరోనాకు ఒకేరోజు బలైన కవల సోదరులు
ఆర్టీసీ కార్మికులను ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించి రూ. 50 లక్షల బీమా ఇవ్వాలని ఎన్ఎంయూ కోరింది. మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు గ్రాట్యుటీ, టెర్మినల్ ఎన్ క్యాష్ మెంట్, ప్రావిడెంట్ ఫండ్ వెంటనే వచ్చేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. కారుణ్య నియామకాల ద్వారా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేలా ఆదేశాలివ్వాలని కోరారు. కరోనా సోకిన ఉద్యోగులకు సంస్థకు చెందిన డిస్పెన్సరీలు, ఆస్పత్రుల్లో హెల్త్ కార్డుల ద్వారా చికిత్స అందించాలని విజ్ఞప్తి చేశారు. వైరస్ బారిన పడిన సిబ్బందికి 30 రోజులు ప్రత్యేక సెలవులు మంజూరు చేయాలని లేఖలో కోరారు.
ఇదీ చదవండి: 'వైఎస్సార్ మత్స్యకార భరోసా' నిధుల విడుదల