కరోనా వైరస్ విజృంభణ కాస్త నెమ్మదించడంతో నగరజీవనం సాధారణ స్థితికి చేరుతోంది. దీంతో విజయవాడలో ప్రజారవాణా వ్యవస్థ పుంజుకుంటోంది. నగరంలో రాకపోకలు సాగించేందుకు ఆర్టీసీ సిటీ సర్వీసులు ఉపయోగపడుతున్నారు. ప్రజావసరాల కోసం తొలుత స్వల్ప సంఖ్యలో పునరుద్ధరించిన సర్వీసులు ప్రస్తుతం సగానికి పైగా నడుస్తున్నాయి. ఆయా మార్గాల్లో ప్రయాణికుల ఆదరణ, అవసరాల మేరకు బస్సుల సంఖ్యను ఆర్టీసీ అధికారులు పెంచుతున్నారు. ప్రజారవాణాను మే చివరి వారంలో ప్రభుత్వం పునరుద్ధరించిప్పటికీ సిటీ బస్సులు నడిపేందుకు సెప్టెంబరులో కానీ అనుమతి ఇవ్వలేదు.
గ్రామ, వార్డు సచివాలయ పరీక్షల దృష్ట్యా సెప్టెంబరు 19 నుంచి సిటీ బస్సులను నడపడం ప్రారంభించారు. మొదట్లో కరోనా కారణంగా ప్రయాణికులు తక్కువగా ఉన్నా, క్రమంగా సంఖ్య పెరిగింది. ప్రారంభంలో వంద బస్సులనే నడిపగా... ఇప్పుడు వాటి సంఖ్య 233కు పెరిగింది. మొత్తం సర్వీసుల్లో ప్రస్తుతం 53 శాతం బస్సులు నడుస్తున్నాయి. గతంలో లాగా నగరంలో విద్యా సంస్థలు, వాణిజ్య కార్యకలాపాలు కూడా పూర్తి స్థాయిలో పుంజుకోకపోవడంతో ఆర్టీసీ అధికారులు అవసరాలను బట్టి సర్వీసులను నడుపుతున్నారు. సర్వీసుల సంఖ్యను పెంచమని ప్రజల నుంచి నిత్యం పలు విజ్ఞప్తులు వస్తున్నాయి. వీటిని పరిశీలించి, ఆయా మార్గాల్లో డిమాండ్‌పై సర్వే చేసి తిప్పుతున్నారు. ఐదో నెంబరు రూట్, పెనమలూరు, మైలవరం, ఆటోనగర్, విస్సన్నపేట, హనుమాన్ జంక్షన్ మార్గాల్లో ఆదరణ కనిపిస్తోంది.
వచ్చే నెల నుంచి పాఠశాలలను పూర్తి స్థాయిలో తెరవనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున నవంబరు 2 నుంచి అదనంగా 50 సర్వీసులు తిప్పేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
ఆదరణ ఉన్న మార్గాలు
మార్గం | నిడివి (కి.మీ) | తిప్పుతున్న బస్సులు |
రైల్వేస్టేషన్ - పెనమలూరు | 15 | 9 |
మైలవరం - విజయవాడ | 44 | 5 |
కండ్రిక - ఆటోనగర్ | 16 | 17 |
విజయవాడ - విస్సన్నపేట | 67 | 10 |
కబేళా - గవర్నమెంట్ ప్రెస్ | 10 | 9 |
కబేళా - ఆటోనగర్ | 16 | 8 |
జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీ -ఆటోనగర్ | 14 | 12 |
ఇదీ చదవండి : డిసెంబర్- జనవరి నాటికి మార్కెట్లో కరోనా వ్యాక్సిన్ : డా.వేణు కవర్తపు