గత నెలలో కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల ప్రభావంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆర్‌అండ్‌బీ రహదారులు ధ్వంసమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 8,270 కి.మీ. మేర రహదారులు దెబ్బతిన్నట్లు అధికారులు లెక్కలు వేశారు. వీటిలో రాష్ట్ర రహదారులు 2,700 కి.మీ. దెబ్బతింటే, జిల్లా ప్రధాన రహదారులు 5,570 కి.మీ.మేర ధ్వంసమయ్యాయి. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 840 కి.మీ., శ్రీకాకుళంలో 698, పల్నాడులో 615 కి.మీ., బాపట్లలో 562 కి.మీ., అనంతపురంలో 536 కి.మీ., శ్రీసత్యసాయిలో 386 కి.మీ., గుంటూరులో 362 కి.మీ, విజయనగరంలో 361 కి.మీ., కృష్ణా జిల్లాలో 350 కి.మీ. మేర రోడ్లు దెబ్బతిన్నాయి. అలాగే వరదల కారణంగా అనేక గ్రామాల పరిధిలో రోజుల తరబడి నీరు నిలిచి ఉండటంతో రహదారులు ఛిద్రమయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 438 కి.మీ., కోనసీమ జిల్లాలో 290 కి.మీ., తూర్పుగోదావరి జిల్లాలో 275 కి.మీ., అల్లూరి సీతారామరాజు జిల్లాలో 199 కి.మీ.మేర రహదారులు మరమ్మతులకు గురయ్యాయి.
వెంటనే మరమ్మతులు చేస్తేనే..: కొన్ని రహదారులపై అడుగడుగునా గుంతలు పడటంతో.. తక్షణం మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ రహదారులపై తాత్కాలిక మరమ్మతుల కింద గుంతలు పూడ్చేందుకు రాష్ట్రం మొత్తం మీద రూ.108 కోట్లు అవసరమని అంచనా వేశారు. శాశ్వత మరమ్మతులు చేసేందుకు రూ.వెయ్యి కోట్ల వరకు వెచ్చించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వీటిలో వరదల వల్ల రహదారులు దెబ్బతిన్న జిల్లాల్లోనే రూ.850 కోట్ల వరకు అవసరమవుతుందని అంచనా వేశారు.
మరమ్మతుల బకాయిల చెల్లింపుల్లో జాప్యం: ఇటీవల వివిధ రుణాలతో చేపడుతున్న రహదారుల పనులకు చెల్లింపులు జరుగుతుండగా.. ఇలా వర్షాలతో దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేస్తే మాత్రం సకాలంలో బిల్లులు అందటం లేదు. గత ఏడాది వర్షాలకు ధ్వంసమైన రహదారులకు ఆయా జిల్లాల్లో గుత్తేదారులు మరమ్మతులు చేయగా.. ఇప్పటికీ కొందరికి బిల్లులు చెల్లించలేదు. గత మార్చిలోనే చెల్లిస్తామని చెప్పినప్పటికీ.. వాయిదా వేస్తూ వచ్చారు. గత నెలలో కొంత మొత్తం చెల్లించగా ఇంకా రూ.100 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. మున్ముందు కురిసే వర్షాలతో మరిన్ని రహదారులు ధ్వంసమయ్యే అవకాశం ఉందని, ఎప్పటికప్పుడు దెబ్బతిన్న రహదారులను మరమ్మతులు చేస్తేనే వాటిపై వాహనదారులు సాఫీగా వెళ్లేందుకు వీలుంటుందని ఇంజినీర్లు చెబుతున్నారు.
ఇవీ చూడండి