రాష్ట్రంలో కరోనా కేసులు నానాటికి విజృంభిస్తున్నాయి. శుక్రవారం కొత్తగా 985 మంది కొవిడ్ బారిన పడినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఫలితంగా రాష్ట్రంలో బాధితుల సంఖ్య 12 వేల 349కు పెరిగింది. తాజా కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే 774 కేసులు వెలుగు చూశాయి.
జిల్లాల్లో..
రంగారెడ్డి జిల్లాలో వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరో 86 మందికి కోవిడ్ సోకింది. మేడ్చల్ జిల్లాలో కొత్తగా 53 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. వరంగల్ అర్బన్‌లో మరో 20 కేసులు బయటపడ్డాయి. మెదక్‌లో 9, ఆదిలాబాద్‌లో 7 కొత్త కేసులు నమోదయ్యాయి.
రాజన్న సిరిసిల్ల, నాగర్ కర్నూల్, నిజామాబాద్ జిల్లాల్లో ఆరు చొప్పున కేసులు నమోదయ్యాయి. సిద్దిపేట, భూపాలపల్లి, ఖమ్మం జిల్లాల్లో... 3 చొప్పున కేసులు వెలుగు చూశాయి. ములుగు, జగిత్యాల, యాదాద్రి జిల్లాల్లో ఇద్దరు చొప్పున కరోనా బారిన పడ్డారు. వికారాబాద్, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది.
75, 308 మందికి పరీక్షలు పూర్తి..
శుక్రవారం.. ఏడుగురు మృతి చెందగా.. కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 237కు చేరింది. మరో 78 మంది డిశ్చార్జ్ అయ్యారు. కోలుకున్నవారి సంఖ్య 4,766కి చేరింది. ప్రస్తుతం 7,436 మంది చికిత్స పొందుతున్నట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది. శుక్రవారం మరో 4,374 మందికి పరీక్షలు చేయగా.....ఇప్పటి వరకు 75, 308 మందికి పరీక్షలు నిర్వహించినట్లు వైద్యారోగ్యశాఖ పేర్కొంది.
ఇవీచూడండి: వార్నింగ్: సరిహద్దులను మార్చడానికి ప్రయత్నించొద్దు