హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి వెంబడి స్థిరాస్తి వ్యాపారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 16వ ప్యాకేజీలో భాగంగా జడ్చర్ల పురపాలికలోని బూరెడ్డిపల్లి శివారు నుంచి సర్వే నెంబర్లు 56, 57, 58, 102/11లో రెండు సొరంగాలు వెళ్తున్నాయి. 8.50 డయా మీటర్ల వెడల్పు గల రెండు సొరంగాలు ఈ సర్వే నెంబర్ల మీది నుంచి ఉదండాపూర్ వరకు వెళ్తాయి. ఈ సొరంగాల కోసం ఆ సర్వే నెంబర్లలోని 41 మంది వద్ద భూసేకరణ చేసి వారికి అవార్డు కూడా పాస్ చేశారు. దీంతో ఈ ప్రాంతమంతా ప్రభుత్వ అదీనంలోకి వెళ్లింది. సొరంగాలు ఏర్పాటు చేసినా.. మీది నుంచి ఓ సంస్థ వెంచరు వేసింది. ఏకంగా 69 ఎకరాల్లో మొత్తం 628 ప్లాట్లతో స్థిరాస్తి వ్యాపారం మొదలుపెట్టింది. అందులో నుంచే సొరంగాలు వెళ్తుండడంతో స్థానిక గ్రామస్థులు ఈ ఏడాది మార్చిలో ఆందోళన చేశారు. అధికారులకు వినతి పత్రం అందించారు.
సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా సొరంగం వెళ్తున్న ప్రాంతంపై భాగాన్ని వెంచర్లలో భాగంగా రోడ్డు వేస్తున్నట్లు లేఅవుట్లలో చూపారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న స్థలాన్ని వెంచర్లలో రోడ్డు వెస్తున్నట్లు చూపించకూడదు. దీంతో పాటు కింది భాగంలో సొరంగాలు వెళితే పైన వెంచర్లకు అధికారులు అనుమతి ఇవ్వకూడదు. కానీ ఇక్కడ రెవెన్యూ, సాగునీరు, పురపాలిక అధికారులు పోటీ పడి అనుమతులు ఇచ్చారు. భవిష్యత్తులో ఇక్కడ ఇళ్లు ఏర్పాటు చేసుకుంటే బోర్లు వేసుకోవాల్సి ఉంటుంది. వాహనాల రాకపోకలు ఉంటాయి. ఒత్తిడికి టన్నల్‌పై ప్రభావం చూపి భారీ ప్రమాదం తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఈ వెంచరులోనే మూడు ఎకరాల్లోనే మురుగోనికుంట ఉంది. దీన్ని కూడా లేఅవుట్లో కలిపేసుకున్నారు. ఈ కుంటను సుందరీకరణ చేస్తామని అధికారుల వద్ద అనుమతులు తీసుకోని సక్రమం చేసుకుంటున్నారు. ఈ కుంటకు వెళ్లే దారులు మూసివేశారు. ఒకప్పడు చుట్టూ పక్కల పశువులు, మేకలు, గొర్రెలు ఈ కుంటలోనే దాహం తీసుకునేవి. ఆ పైగా కుంటకు ఉన్న పార్ట్ కాలువలు, తూంలు పూడ్చివేసి రియల్ దందా చేస్తున్నారు. పెద్ద ఎత్తున్న డబ్బులు చేతులు మారడం వల్లనే ఇష్టారాజ్యంగా వెంచరు వేస్తున్న అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
విశ్వసనీయ సమాచారం మేరకు టన్నెల్ ఉన్న ప్రాంతంలో వెంచరుకు ఇచ్చిన అనుమతులపై సాగునీటి ప్రాజెక్టు అధికారుల్లో అభిప్రాయ భేదాలు తలెత్తినట్లు సమాచారం. కొందరు అధికారులు టన్నెల్‌పై నుంచి వెంచరుకు ఎలా అనుమతులు ఇస్తారని ఉన్నతాధికారులను ప్రశ్నించినట్లు సమాచారం. ప్రభుత్వం భూసేకరణ చేసి అవార్డు పాస్ చేసిన తర్వాత వెంచర్లు ఆ ప్రాంతాన్ని ఎలా కలుపుకుంటారని ప్రశ్నించినట్లు తెలిసింది. అయితే ఆ శాఖల్లోని ఒకరిద్దరు అధికారులు టన్నెల్ పైభాగన రోడ్డుకు స్థలం వదులుతున్నాం కదా.. ఏం కాదంటూ నో అబ్జెక్షన్ అనుమతులు ఇచ్చారు. టన్నెల్ వెళ్లే ప్రాంతంలో మార్కింగ్ వేసి హద్దు రాళ్లు నాటాలి. ప్రస్తుతం అవీ కూడా కనిపించడం లేదు. వీటిపై కూడా అధికారులు నోరు మెదపడం లేదు.
ఇదీ చూడండి: విరసం నేత కల్యాణ్‌రావు ఇంట్లో ఛత్తీస్‌గఢ్ పోలీసుల సోదాలు