రేషన్ డీలర్ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని డీలర్లు ఆవేదన వ్యక్తం(Ration dealers Agitation) చేశారు. రేషన్ డీలర్లను ఇబ్బంది పెట్టే జీవో నంబర్ 10ని రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా మండలస్థాయి స్టాక్ పాయంట్ల వద్ద ఆందోళనలు చేశారు. జీవో 10 వెంటనే రద్దు చేయాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే నవంబర్ నెలకు సంబంధించి చౌక దుకాణాలకు బియ్యం తీసుకోబోమంటూ హెచ్చరించారు.
ప్రజాపంపిణీ వ్యవస్థలో ఓ భాగమైన తమను ఉద్దేశపూర్వకంగానే బయటకు పంపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. జీవోను తక్షణం రద్దు చేయాలి. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు దశల వారీగా ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తాం. -మండాది వెంకటరావు, రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు
విజయవాడలో గొల్లపూడి మార్కెట్ యార్డులోని ఎంఎల్‌ఎస్ పాయింట్ వద్ద ధర్నా చేపట్టారు. దశాబ్దాలుగా రేషన్ డీలర్లకు ప్రభుత్వం ఖాళీ గోనెసంచులు ఇస్తోందని.. అయితే ప్రస్తుత ప్రభుత్వ విధానాలతో తమను ఆర్థికంగా నష్టాలకు గురిచేస్తోందని డీలర్లు ఆవేదవ్యక్తం చేశారు. పౌరసరఫరాల శాఖకు చెందిన కొందరు అధికారులు తప్పుడు ఆలోచనలతో కొత్త సమస్యలను సృష్టిస్తున్నారని ఆరోపించారు. తమకు వచ్చే ఆదాయంలో సగం మొత్తానికి కోత పెడుతున్నారని వాపోయారు. మధ్యాహ్న భోజన పథకం, అంగన్‌వాడీ బకాయిలు ఇంకా చెల్లించాలన్నారు. ముఖ్యమంత్రి జగన్ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.
మైలవరం రేషన్ డీలర్ల ఆందోళనలు..
కృష్ణా జిల్లా మైలవరం మార్కెట్ యార్డులో స్థానిక రేషన్ డీలర్ల యూనియన్ ధర్నా(ration dealers agitations at mailavaram) చేపట్టింది. జీవో నంబర్ 10ని వెంటనే రద్దు చేయాలని, మిడ్ డే మీల్స్ ఐసీడీఎస్ బిల్స్ వెంటనే విడుదల చేయాలని రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు కుతాడి రామకృష్ణ డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే నవంబర్ నెలకు ఇవ్వాల్సిన రేషన్ ఇవ్వకుండా ధర్నాకి దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల రేషన్ డీలర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
గుంటూరులో ధర్నా ..
గుంటూరు ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద రేషన్ డీలర్లు ధర్నా చేశారు. డీలర్లు ఆర్థికంగా ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వైఏడి ప్రసాద్ కోరారు. ప్రస్తుతం నిత్యావసరాలు వస్తువుల ధరలు పెరిగాయని.. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న కమిషన్‌ను వెంటనే విడుదల చేయాలని కోరారు.
కర్నూలు జిల్లాలో..
జీవో నంబర్10ని రద్దు చేయాలని.. పాత బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌తో కర్నూలు జిల్లాలో డీలర్లు ఆందోళనలు చేపట్టారు. పౌరసరఫరాల గోదాముల వద్ద ధర్నాలు నిర్వహిస్తున్నారు. కర్నూలు, ఆత్మకూరు మండలాల్లోని గోదాముల వద్ద నిరసనలు తెలిపారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్.. ఖాళీ సంచులు డీలర్లకే చెందాలని జీవో విడుదల చేస్తే.. ఆయన తనయుడు అందుకు విరుద్దంగా జీవో నెంబర్10ని తీసుకొచ్చారని మండిపడ్డారు. ఖాళీ సంచులు తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాలని ఆదేశించడం దేశంలో ఎక్కడా లేదని డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ ఖాద్రీ విమర్శించారు.
డోన్‌లోని గోదాము వద్ద లారీలోకి సరుకు ఎత్తకుండా అడ్డుకున్నారు(ration dealers protest against go number 10). అన్లోడింగ్, గోన సంచులను రాష్ట్ర ప్రభుత్వమే తీసుకొని మాకు నెలకు జీతం రూ. 20 వేల ఇవ్వాలని డీలర్ల సంఘం ప్రెసిడెంట్ సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఖాళీ గోనె సంచులు తిరిగి తమకే ఇవ్వాలంటూ నంద్యాలలో రేషన్ డీలర్లు ధర్నా చేపట్టారు. స్థానిక ఎంఎల్సీ పాయింట్ వద్ద డీలర్ల సంఘం నాయకులు బైఠాయించి నిరసన తెలిపారు. గోదాము నుంచి సరుకును బయటకు పంపకుండాఅడ్డుకుంటామని హెచ్చరించారు.
కడప జిల్లాలో..
వైకాపా సర్కార్.. రేషన్ డీలర్ల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తోందని రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామ్ మనోహర్‌రెడ్డి ధ్వజమెత్తారు. డీలర్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను ఖండిస్తూ.. కడపలోని మండల స్టాక్ పాయింట్ వద్ద డీలర్లు నిరసన చేపట్టారు. ప్రభుత్వం రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్తంగా రేషన్ డీలర్లు దుకాణాలు, స్టాక్ పాయింట్లను మూసివేస్తామని హెచ్చరించారు.
నెల్లూరులో..
నెల్లూరులో రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆందోళన చేపట్టింది. దివంగత ముఖ్యమంత్రి ఇచ్చిన జీవో తెలంగాణలో అమలు చేస్తుంటే, రాష్ట్రంలో మాత్రం గోనె సంచులను వెనక్కి తీసుకోవాలని ప్రయత్నించడం దారుణమని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుదర్శన రమేష్ ఆందోళన వ్యక్తం చేశారు. తమకు గౌరవ వేతనమిచ్చి, ఉద్యోగ భద్రత కల్పిస్తే గోని సంచులు తిరిగిచ్చేందుకు సిద్ధమేనన్నారు. గతంలో రేషన్ డీలర్లను అధికారులే అవినీతిపరులుగా చిత్రీకరించారని, అయితే ఇప్పుడు విజిలెన్స్ దాడులు, రేషన్ బియ్యం ఎలా పట్టుబడుతోందని ప్రశ్నించారు.
ఇదీ చదవండి..: YSR RYTHU BHAROSA: మేనిఫెస్టోలో హామీలు వంద శాతం నెరవేరుస్తున్నాం: సీఎం జగన్