రేషన్ కోసం పేదలను రోడ్ల మీదకు తీసుకొచ్చి ప్రభుత్వం వారిని బిచ్చగాళ్లుగా మార్చిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఇంటింటికీ రేషన్ అంటూ వీధుల్లో మహిళలను నిలబెట్టడం దుర్మార్గమన్నారు. రేషన్ వ్యవస్థను వైకాపా భ్రష్టు పట్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ డీలర్ల సంఘం నేతలు చంద్రబాబును కలసి తమ సమస్యలపై వినతిపత్రం అందించారు. గతంలో వారంలోనే అందరికీ బియ్యం అందితే ఇప్పుడు నెలకు పది శాతం మందికి కూడా రేషన్ ఇవ్వలేకపోతున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ గోనెసంచులు కూడా వదలడం లేదని.., జే-టాక్స్ కోసం రేషన్ డీలర్ల వ్యవస్థను నాశనం చేశారన్నారు.
గతంలో వీలు కుదిరినపుడు రేషన్ షాపులకు వెళ్లి ప్రజలు రేషన్ తెచ్చుకునే వారని..ఇప్పుడు ఒక నిర్ధిష్ట సమయంలో మాత్రమే తీసుకునేలా చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆక్షేపించారు. కేజీకి 20 పైసలు ఉన్న కమిషన్ను తమ ప్రభుత్వం హయంలో రూపాయికి పెంచిందన్నారు. ప్రజలకు రేషన్ ఇవ్వడానికి గతంలో ఒక్కో షాపునకు ఏడు వేలు ఖర్చు అయితే.. తుగ్లక్ పాలనలో 28 వేలు ఖర్చు అవుతోందన్నారు. రేషన్ డీలర్లకు పెండింగ్ కమీషన్ను వెంటనే అందించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. కరోనా సమయంలో రేషన్ అందిస్తూ..వైరస్ బారినపడి చనిపోయిన రేషన్ డీలర్లకు రూ. 50 లక్షల పరిహారం అందించాలన్నారు.
ఇదీచదవండి