నైరుతి బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం, వాతావరణంలో ఒక్కసారిగా చోటుచేసుకున్న మార్పులతో తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర కోస్తాంధ్రలో ఒకట్రెండుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రలో.. ఇవాళ, రేపు, ఎల్లుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు పేర్కొంది.
విజయవాడలో రోడ్లు జలమయం..
విజయవాడ నగరవ్యాప్తంగా వర్షం ఉదయం 9గంటల నుంచి వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా వాతావరణంలో మార్పు చోటు చేసుకోవటంతో.. స్థానికులు ఇబ్బందులు గురయ్యారు. ఇవాళ ఉదయం వాతావరణం చల్లబడటంతో పాటు.. వర్షానికి నగరంలోని పలు రోడ్లన్నీ జలమయమయ్యాయి. కాల్వల్లో చెత్తాచెదారం తీయకపోవడంతో.. డ్రైనేజీలు పొంగి.. వర్షపు నీరు రహదారులపై నిలిచిపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. పలు కాలనీల్లో నిలిచిన వర్షపు నీటిని.. కార్పొరేషన్ సిబ్బంది తోడుతున్నారు.
పంటలకు తీవ్ర నష్టం...
ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం, మార్కాపురం, పొదిలి, తర్లుపాడు, కొనకనమిట్ల, చీరాల, వేటపాలెం, చినగంజాం, గిద్దలూరు లో భారీ వర్షం కురిసింది. రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కర్నూలులో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. గుంటూరు జిల్లాలోని బాపట్ల, కాకుమాను, ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు, పెదనందిపాడు, చిలకలూరిపేట, మాచవరం, మంగళగిరి, చెరుకుపల్లి మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఇటీవల కురిసిన వర్షాలకు మిరప, వరి పంటలకు నష్టం వాటిల్లగా... ప్రస్తుతం శనగ, పొగాకు, మినుము పంటలకు నష్టం కలిగింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా, జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి.
ఇదీ చదవండి: Tirumala: తిరుమలలో వైభవంగా స్వర్ణ రథోత్సవం.. పాల్గొన్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు