MEPMA: ఆ మహిళలంతా ఒకప్పుడు కూలి పనులు చేసుకుని జీవనం సాగించేవారు. కుటుంబపోషణ భారమై పిల్లలను చదివించలేని స్థితిలో ఉండేవారు. అలాంటి వారి జీవితాలు కుట్టుమిషన్ శిక్షణతో వెలుగులు నింపుకున్నాయి. పట్టణ ప్రాంత పేదరిక నిర్మూలన పథకం ద్వారా శిక్షణ తీసుకున్న మహిళలు బ్యాంకు రుణాలు పొంది దుస్తులు కుట్టి, టోకుగా విక్రయిస్తున్నారు.
అనంతపురం జిల్లా గుంతకల్లులో మెప్మా పథకం నిరుపేద మహిళలకు ఉపాధి మార్గాలను చూపుతోంది. నగర, పట్టణ ప్రాంతాల్లో అమలవుతున్న ఈ పథకం ద్వారా పేద మహిళలు దుస్తులు కుట్టడంలో శిక్షణ తీసుకుని ఆదాయం పొందుతున్నారు. సొంతంగా దుస్తులు కుట్టి టోకుగా దుకాణాలకు విక్రయించటం మొదలుపెట్టారు. క్రమంగా ప్రతి ఒక్కరూ రోజుకు 500 నుంచి వెయ్యి రూపాయల వరకు సంపాదిస్తున్నారు.
మొదట్లో పెద్దఎత్తున దుస్తులు కుట్టి పామిడిలోని దుస్తుల పరిశ్రమకు తరలించేవారు. కరోనా సమయంలో తలెత్తిన ఇబ్బందుల కారణంగా మహిళలకు అవకాశాలు తగ్గిపోయాయి. అయినా దిగులు చెందకుండా వస్త్ర తయారీ పరిశ్రమ నుంచి వస్త్రాలు తెప్పించి... సొంత డిజైన్లతో దుస్తులు రూపొందించటం ప్రారంభించారు. అలా క్రమంగా ఆదాయం పొందుతున్నట్లు మహిళలు చెబుతున్నారు.
మెప్మాలో శిక్షణ పొందిన మహిళలంతా సంఘాలుగా ఏర్పడి... పొదుపు చేసుకుంటున్నారని... దీని ద్వారా వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడినట్లు మహిళా సంఘం బాధ్యురాలు వరలక్ష్మి తెలిపారు. మెప్మా... మహిళలకు శిక్షణతో పాటు పలువురికి ఆధునిక కుట్టు మిషన్లు అందించిందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ఇదీ చదవండి: Polavaram Visit: పోలవరం నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తాం: షెకావత్