రాష్ట్రంలో తిరుమల తర్వాత ప్రసిద్ధ పుణ్యక్షేత్రం... విజయవాడలోని దుర్గామల్లేశ్వర దేవస్థానం. ఎంతో ఘన చరిత్ర కలిగిన ఈ దేవస్థానానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. ఇక దసరా వంటి ప్రత్యేకమైన రోజుల్లో... ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోతాయి. స్థలాభావంతో ఆలయం అనుకున్న స్థాయిలో అభివృద్ధి చెందడం లేదు. ఉత్సవాల సమయంలో అధికసంఖ్యలో వచ్చే భక్తుల కోసం ఏటా తాత్కాలిక ఏర్పాట్లు చేయాల్సి వస్తోంది. ఈ సమస్యలన్నింటినీ అధిగమించేందుకు బృహత్ ప్రణాళిక సిద్ధం చేయాలని దేవస్థానం భావిస్తోంది.
హైదరాబాద్‌కు చెందిన క్రియాటో సొల్యూషన్స్, సూరత్‌కు చెందిన బ్లాక్ ఇంక్ కన్సల్టెంట్ సంస్థలు... దుర్గామల్లేశ్వర దేవస్థానం మాస్టర్ ప్లాన్ రూపొందించేందుకు ఆసక్తి కనబరిచాయి. ఈ రెండు సంస్థలకు చెందిన బృందాలు ఇంద్రకీలాద్రిని సందర్శించి... ఆలయ పరిసరాలను పరిశీలించాయి. ఘాట్ రోడ్డు, చినరాజగోపురం, శివాలయం, పెదరాజగోపురం, మహామండపంలోని భోజనశాల, దుకాణాల సముదాయం, ప్రసాద వితరణ కేంద్రాలను పరిశీలించాయి. ఈ సంస్థలు త్వరలోనే డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తాయని ఆలయ అధికారులు తెలిపారు.
కొండపై మౌలిక వసతులు, అన్నదాన కేంద్రం, ప్రసాదం పోటు, క్యూలైన్ల వ్యవస్థ, కేశ ఖండనశాల, పారిశుద్ధ్య నిర్వహణ, దుర్గగుడి కార్యాలయాలతో పాటు భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై బృహత్ ప్రణాళికను ఈ సంస్థలు రూపొందించనున్నాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ ప్రక్రియ పూర్తికానుంది.
ఇదీచదవండి