రైతులకు కనీస మద్ధతు ధర కల్పించే నిమిత్తం... పత్తి కొనుగోళ్ల అంశంలో 2014-15లో భారతి పత్తి సంస్థలో భారీ కుంభకోణం జరిగిందని హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. ఏడు పత్తి కొనుగోలు కేంద్రాల్లో సీబీఐ ఇప్పటికే దర్యాప్తు చేసి కేసులు నమోదు చేసింది. మిగిలిన 36 కేంద్రాల్లో సైతం సీబీఐచే విచారణ జరిపించి... క్రిమినల్ కేసుల నమోదుకు ఆదేశించాలని మచిలీపట్నానికి చెందిన వెంకట వీర హనుమ, మరో ఐదుగురు పిటీషన్ దాఖలు చేశారు.
2014-15లో పత్తి కొనుగోళ్లలో 650 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని... రైతులకు మద్ధతు ధర కల్పిస్తూ కొనుగోలు చేయాలన్న నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేశారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. సీసీఐ, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారుల పాత్ర ఉందని న్యాయవాది ఆరోపించారు. రైతుల నుంచి వ్యవసాయ మార్కెట్ నుంచి పత్తి కొనుగోలు చేయాల్సి ఉండగా ..దళారుల నుంచి తక్కువ రేటుకు కొనుగోలు చేసి సీసీఐకు ఎక్కువ రేటు విక్రయించారన్నారు. కొన్నిచోట్ల జూట్ మిల్లుల నుంచి కొనుగోలు చేశారని, మరికొన్ని చోట్ల నకిలీ రైతుల నుంచి కొనుగోలు చేశారన్నారు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం... మిగిలిన 36 కేంద్రాల్లో సీబీఐ విచారణ చేసిందా లేదా అనే విషయం తెలుసుకుంటామని స్పష్టం చేసింది. సీబీఐ న్యాయవాదికి స్పందించేందుకు సమయం ఇస్తూ.. కేసును వచ్చే వారానికి వాయిదా వేసింది.
ఇవీ చదవండి...'సహాయ ఆచార్యుల పరీక్షను రద్దు చేయాలి'