Pig Competitions: తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలో పందుల పోటీలు ఘనంగా నిర్వహించారు. శ్రీ తిక్క వీరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల ఈ సందర్భంగా నిర్వాహకులు పందుల పోటీలు ఏటా జరుపుతుంటారు. పందుల పోటీలను తిలకించేందుకు జనం భారీగా తరలివచ్చారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు మన రాష్ట్రం నుంచే కాకుండా... ఏపీ, కర్ణాటక రాష్ట్రాల నుంచి సుమారు 25 జతల పందులు వచ్చాయి.
వీటి మధ్య పోరాటాన్ని చూసేందుకు జనం తండోపతండాలుగా తరలివచ్చారు. అయిజ, పెబ్బేర్, కర్నూల్, అనంతపురం కడప, రాయచోటి, కోడుమూరు, తాడిపత్రి, రాయచూర్, రాయదుర్గం తదితర ప్రాంతాల నుంచి పందులు పోటీకి తరలివచ్చాయి. ఈ పోటీలలో పారిపోకుండా ఎక్కువ సేపు పోరాడే పందులను నిర్వాహకులు విజేతలుగా ప్రకటిస్తారు. గెలుపొందిన పందుల యజమానులకు నగదు బహుమతులను అందజేయనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. జాతర సందర్భంగా నిర్వహించిన పందుల పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.