ఆర్టీసీలో విశ్రాంత ఉద్యోగులకు 2017 పీఆర్‌సీ బకాయిలు చెల్లించాలని ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్.. సిబ్బందిని ఆదేశించారు. ఈనెల 27, 30న రెండు విడతల్లో సుమారు 70 కోట్లు బకాయిలు చెల్లించాలని ఆదేశాల్లో తెలిపారు. ఉత్తర్వులపై ఎంప్లాయిస్ యూనియన్, ఎస్‌డబ్ల్యూఎఫ్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. 2019 మార్చి - సెప్టెంబర్ మధ్య రిటైర్ అయిన వారికి, సర్వీసులో ఉన్న ఉద్యోగులకూ 2017 పీఆర్‌సీ బకాయిలు చెల్లించాలని ఈయూ నేతలు ఎండీని కోరారు.
ఈయూతో చేసుకున్న ఒప్పందం ప్రకారం 2020 జులై లోగా బకాయిలు చెల్లించాల్సి ఉందని, చెల్లింపు పక్రియ ప్రారంభించనందున వెంటనే బకాయిలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. ఎస్ఆర్బీఎస్ / ఎస్బీటీ ట్రస్టులు మూసి వేసినందున ఆ బకాయిలు సైతం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. 2017 నుంచి పెండింగు ఉన్న లీవ్ ఎన్‌క్యాష్ మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని ఈయూ నేతలు దామోదర్, వైవీ రావు కోరారు.
మరో వైపు.. ఆర్టీసీ సిబ్బందికి బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు తాత్కాలికంగా ఆపాలని ఎండీకి ఈయూ విజ్ఞప్తి చేసింది. బ్రీత్ ఎనలైజర్ పరీక్ష ద్వారా కరోనా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని సిబ్బంది ఆందోళన చెందుతున్నారని తెలిపింది. సిబ్బంది ఆందోళన దృష్ట్యా కరోనా వ్యాప్తి తీవ్రత తగ్గే వరకూ బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు ఆపాలని ఎండీని ఈయూ నేతలు కోరారు.
ఇదీ చదవండి: