రాష్ట్రంలో 21 లక్షల మంది మంది గుర్తింపు పొందిన భవన నిర్మాణ కూలీలు ఉన్నారని...మరో 30 లక్షల మంది వరకు గుర్తింపు పొందని కూలీలు ఉన్నారని పవన్ కల్యాణ్ అన్నారు. కేంద్ర కార్మికశాఖ మంత్రి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలనాధికారులకు సంబంధిత శాఖల నుంచి నిధులు విడుదల చేసేలా లేఖలు రాశారని గుర్తు చేశారు. లాక్డౌన్ కారణంగా రోజువారి కూలీలు తమ జీవనాధారాన్ని కోల్పోయారని గుర్తు చేశారు. మరోవైపు రాష్ట్రంలో 17.62 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతున్నాయని...ఉద్యాన పంటలు నిత్యావసర వస్తువులు పోషకాహార ఆహార పదార్థాల కిందికి వస్తాయన్నారు.
ప్రస్తుతం ఉద్యాన పంటలు ఇబ్బందుల్లో ఉన్నాయని ముఖ్యంగా అరటి రైతులు పంటను కోల్పోయే ప్రమాదముందన్నారు. ఇప్పటికే పెట్టుబడుల రూపంలో రైతులు చాలా వెచ్చించారని లాక్డౌన్ కారణంగా మార్కెట్లు మూతపడటంతో వారంతా దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. ఆక్వా ఎగుమతుల్లో దేశంలోనే తొలి వరుసలో ఉన్న రాష్ట్రంలో ప్రభుత్వం పెంచిన ధరలు.....తమ వరకు చేరుతాయో లేదోనన్న సందేహంలో ఆక్వా రైతులు ఉన్నారని పేర్కొన్నారు. వీరందరికీ న్యాయం చేసేలా ప్రభుత్వం వద్ద ఉన్న పర్యవేక్షణ పద్ధతులేంటని పవన్ ట్విట్టర్లో ప్రశ్నించారు.
ఇదీ చదవండి: మిరపకు కరోనా ఘాటు... పొలాల్లోనే ఎండిపోతున్న పంట