‘అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని. అదే భాజపా-జనసేన పార్టీల సంయుక్త విధానం. ఇందులో రెండో మాటకు తావులేదు. అక్కడి రైతులకు అన్యాయం జరగకుండా కాపాడతాం. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిచేసే బాధ్యత కూడా మనదే. ఈ రెండు విషయాల్లో ప్రజలకు పూర్తి భరోసా ఇవ్వండి’ అని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు స్పష్టంచేశారు. బుధవారం సాయంత్రం ఇక్కడి 7-బి మోతీలాల్‌నెహ్రూ మార్గ్‌లోని నివాసంలో పవన్‌కల్యాణ్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో కలిసి నడ్డాతో సమావేశమయ్యారు. సుమారు గంటపాటు వివిధ అంశాలపై చర్చించారు. అమరావతి, పోలవరంతో పాటు ఏపీలో ఇతర విషయాలపై ఐక్యంగా పని చేసేందుకు భాజపా- జనసేన నేతలతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. మున్ముందు ఆయా అంశాలపై కమిటీలో చర్చించాకే ఇరు పార్టీల నేతలు స్పందించాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, త్వరలో జరగనున్న ఉపఎన్నిక (తిరుపతి లోక్‌సభ)కు సంబంధించి చర్చించేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను ఆహ్వానించినట్లు నడ్డా బుధవారం రాత్రి ట్వీట్ చేశారు.
సమన్వయంతో ముందుకెళ్తాం: పవన్
భాజపా అధినేత నడ్డా ఆహ్వానం మేరకే తాము దిల్లీకి వచ్చామని, ఇప్పటికే ఆ పార్టీలోని కొంతమంది సీనియర్ నేతలను కలిశామని భేటీ అనంతరం పవన్ విలేకర్లకు చెప్పారు. ‘భాజపా జాతీయ అధ్యక్షుడితో అమరావతి, పోలవరంపై చర్చించాం. భవిష్యత్తులో ఇరు పార్టీల ఉమ్మడి కార్యాచరణ, సమన్వయంపై లోతుగా చర్చించాం. అమరావతిలో చివరి రైతుకూ న్యాయం జరిగే వరకు మేం వారి పక్షాన నిలబడతాం. ఇది నడ్డా నోటి నుంచి వచ్చిన మాటే. అదే నేను చెబుతున్నా. రాష్ట్రంలో అవినీతి, శాంతిభద్రతల పరిస్థితి, ఆలయాలను అపవిత్రం చేయడం, 800కి పైగా దేవతా విగ్రహాలు, రథాలు ధ్వంసం కావడంపై చర్చించాం. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టడంపైనా మాట్లాడుకున్నాం. భాజపా, జనసేన అభ్యర్థుల్లో ఎవరు పోటీ చేయాలన్నది అంతర్గత కమిటీ వేసి, చర్చించుకొని ముందుకెళ్తాం’ అని వివరించారు.
‘తిరుపతి’ కోసం కాదు: నాదెండ్ల
నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ‘పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా స్వీకరించాం. భాజపా- జనసేన పార్టీలతో కలిసి కేంద్ర ప్రభుత్వం దాన్ని పూర్తిచేస్తుందన్న భరోసాను ప్రజలకు ఇవ్వండి. ప్రాజెక్టులు ప్రజలకు ఉపయోగపడేలా కట్టాలి తప్ప, నాయకుల కోసం కాదు. రాజధాని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమైనప్పటికీ కొత్త ప్రభుత్వం దాన్ని మార్చేస్తామనడం కుదరదు. అమరావతి రైతులకు న్యాయం జరిగేలా ఇరు పార్టీలు కలిసి పోరాడతాయని చెప్పండి’ అని నడ్డా తమతో చెప్పినట్లు వివరించారు. తిరుపతి ఉప ఎన్నిక సీటు కోసం దిల్లీకి వచ్చినట్లు జరిగిన ప్రచారాన్ని ఆయన ఖండించారు. ‘కేవలం ఉప ఎన్నిక కోసం ఇంతదూరం రావాల్సిన అవసరం లేదు. జనసేన తరఫున తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం చర్చిస్తాం తప్ప రాజకీయాల కోసం కాదు. రెండు రోజులుగా రాష్ట్ర, కేంద్ర నాయకత్వంలోని సీనియర్లతో పవన్ చర్చించారు. ఉమ్మడిగా రోడ్ మ్యాప్ రూపొందించడం, వచ్చే ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఎలా అన్న అంశంపైనే చర్చించాం’ అని మనోహర్ వివరించారు.
ఇదీ చదవండి: