NCC Lands: విశాఖలోని మధురవాడలో రూ.1,500 కోట్ల విలువైన 97.30 ఎకరాల భూమిని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి బినామీ కంపెనీకి రూ.200 కోట్లకు దోచిపెట్టడం కుంభకోణం కాకపోతే మరేమిటని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. ఆ భూమిని ఎన్‌సీసీకి రూ.187 కోట్లకు కట్టబెట్టి, ఆ సంస్థను బెదిరించి రూ.200 కోట్లకు బెంగళూరుకి చెందిన ముఖ్యమంత్రి జగన్, విజయసాయిరెడ్డిల బినామీ కంపెనీ జీఆర్‌పీఎల్‌కి దోచిపెట్టారని ఆయన బుధవారం విలేకరుల సమావేశంలో ఆరోపించారు.
‘‘ఆ భూమికి ప్రభుత్వం నిర్ణయించిన రూ.97 కోట్లను ఎన్‌సీసీ సంస్థ 2021 అక్టోబరు 26న చెల్లిస్తే, సేల్ డీడ్ చేయమని ఆ మర్నాడే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదే రోజు భూమి రిజిస్ట్రేషన్ కూడా చేసేశారు. అన్ని కార్యక్రమాలు ఒకే రోజు చక్కబెట్టమని విశాఖలోని మీ రాజ గురువు ఏమైనా ముహూర్తం పెట్టారా? ఆ తర్వాత ఆ భూమిని ఎన్‌సీసీ సంస్థ జీఆర్‌పీఎల్‌కి అమ్మేస్తోంది. ఇంత మెరుపు వేగంతో చేయాల్సిన అవసరమేమిటి? దీన్ని బట్టే ముఖ్యమంత్రికి ఆ భూమిపై ఎంత ప్రత్యేక ఆసక్తి ఉందో అర్థమవుతోంది. వాస్తవాలు ఇలా ఉంటే... మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం అంతా తెదేపా ప్రభుత్వ హయాంలోనే జరిగిందన్నట్టుగా విలేకరుల సమావేశంలో పచ్చి అబద్ధాలు చెప్పారు...’’ అని పట్టాభి ధ్వజమెత్తారు.
రూ.187 కోట్లకు కొన్న భూమిని రూ.200 కోట్లకు అమ్మేస్తుందా?
‘‘రూ.187 కోట్లకు కొన్న భూమిని ఎన్‌సీసీ కంపెనీ పెద్దగా లాభమేమీ లేకుండా కేవలం రూ.200 కోట్లకే అమ్మేస్తుందా? అంత విలువైన భూమిని ఎన్‌సీసీకి రూ.187 కోట్లకే ఎలా ఇచ్చేశారని ఒక విలేకరి బొత్సను అడిగితే... ఆ సంస్థ 2005లోనే రూ.90 కోట్లు కట్టిందని, దానిపై వడ్డీ లెక్కేస్తే ఏ ఐదారు వందల కోట్లో అవుతుందన్నారు. ఇన్ని కోట్లు వడ్డీ కింద ఏ విధంగా అవుతుందోనన్న లెక్కలు బొత్సకే తెలియాలి. మరి ఎన్‌సీసీ పదిహేనేళ్లు ఎదురు చూసి, ఇప్పుడు భూమి చేతికి వచ్చాక కేవలం రూ.200 కోట్లకు ఎందుకు అమ్మేస్తుంది? అక్కడ ఎకరం భూమి విలువ రూ.6 కోట్ల వరకు ఉంటుందని బొత్స విలేకరుల సమావేశంలో వాస్తవం చెప్పేశారు. ఆ లెక్కన చూసుకున్నా ఆ భూమి విలువ కనీసం రూ.600 కోట్లు ఉంటుంది కదా?’’ అని పట్టాభి పేర్కొన్నారు.
‘‘మంత్రి బొత్స తాను ఉత్తరాంధ్రలో పుట్టి పెరిగానని, తనకు అంతా తెలుసునని చెబుతారు కదా? మరి మధురవాడలో ప్రస్తుతం గజం ధర ఎంత ఉంటుందో ఆయనకు తెలియదా? ప్రభుత్వం కట్టిన లెక్క ప్రకారం అక్కడ చదరపు గజం విలువ రూ.4 వేలే ఉన్నట్టు. చదరపు గజం రూ.40 వేలు ఉన్న చోట, దానిలో పది శాతానికి భూమిని కొట్టేయడం కుంభకోణం కాదా?’ అని ధ్వజమెత్తారు. ఎన్‌సీసీ సంస్థకు చంద్రబాబు ప్రభుత్వమే జీపీఏ ఇచ్చేసిందని బొత్స అబద్ధాలు చెప్పారని ఆయన మండిపడ్డారు. ‘‘న్యాయస్థానాలకు వెలుపల సామరస్యంగా సమస్య పరిష్కరించుకుందామని ఎన్‌సీసీ కోరితే... ఆ భూమి అప్పటి విలువను, అమ్మకపు విలువను ఇద్దరు వాల్యుయేటర్ల ద్వారా మదింపు చేయించి, దానిలో గరిష్ఠ మొత్తంపై 20 శాతం అదనంగా వసూలు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది.
స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇవ్వాలని ఎన్‌సీసీ సంస్థ కోరితే... ఆ భూమిపై ఎన్‌సీసీకి జీపీఏ ఇచ్చేందుకు ఏపీహెచ్‌బీకి వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో జరిగింది అంతే. 2019 మే 21న ముసాయిదా జీపీఏని ప్రభుత్వానికి హౌసింగ్ బోర్డు వైస్‌ఛైర్మన్ పంపారు. రెండు వాల్యుయేషన్ సంస్థలు ఇచ్చిన నివేదికల్ని పరిశీలించి సిఫార్సులు చేయడానికి ఒక కమిటీని నియమించాలని... హౌసింగ్ బోర్డు ఛైర్మన్ 2019 జూన్ 4న లేఖ రాశారు. 2020 డిసెంబరు 20న కమిటీని నియమిస్తూ వైకాపా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవాలు ఇలా ఉంటే... అంతా గత ప్రభుత్వమే చేసిందని బొత్స అబద్ధాలు చెప్పారు’’ అని పేర్కొన్నారు.
‘‘ఎన్‌సీసీ సంస్థ గతంలో కట్టిన రూ.90 కోట్లకు అదనంగా ఇప్పుడు రూ.97 కోట్లు కడితే... 187 ఎకరాల భూమి కట్టబెట్టేయవచ్చని సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి జీవో నం.67 జారీ చేశారు. ఇలాంటి కుంభకోణంలో భాగస్వాములై ఉత్తర్వులు జారీ చేసినందుకు ఆమె అవమానంగా భావించాలి’’ అని పట్టాభి పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ప్రభుత్వానికి ఆదాయార్జన ఎంత కష్టమో అందరికీ తెలుసు: మంత్రి బుగ్గన