తెదేపా ప్రభుత్వం 365, 430 చదరపు అడుగుల్లో నిర్మించిన టిడ్కో ఇళ్లకు బ్యాంకు రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పిన సీఎం జగన్.. లబ్ధిదారులను మోసం చేశారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. ఇళ్ల పట్టాల పంపిణీ సభలో 482 కోట్లు మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పి మాటమార్చారని మండిపడ్డారు. 365 చదరపు అడుగుల ఇళ్లు 74, 312 ఉండగా...ఒక్కో లబ్ధిదారుడు 3.50 లక్షలు చెల్లించాల్సి ఉందన్నారు.
ప్రభుత్వం మాత్రం 25 వేలు మాత్రమే ఇస్తామంటూ 2,405 కోట్లకు కొర్రీలు పెడుతోందని ఆక్షేపించారు. 430 చదరపు అడుగల ఇళ్లు 44,304 ఉండగా... వీటికి సంబంధించి మరో 1,540 కోట్లు కలిపి మొత్తంగా 3,924 కోట్లు కొల్లగొట్టేలా మోసగిస్తున్నారన్నారు. ఇళ్లపట్టాల భూములపై తెదేపా కేసులు పెట్టిందని తప్పుడు ప్రచారం చేశారని.. అలాంటి సీఎం... 90 శాతం ప్లాట్ల పంపిణీకి ఎలా శ్రీకారం చుట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. తాడేపల్లి ప్యాలెస్‌కు అందాల్సిన వాటాలు అందలేదనే ఇన్నాళ్లూ.. ఇళ్లపట్టాలు ఇవ్వకుండా తొక్కిపెట్టారని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి:
పోలీసుల ప్రోద్బలంతోనే జేసీ ఇంటిపై దాడి: ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి