కేంద్ర ప్రకటించిన పద్మ పురస్కారాల్లో తెలుగు తేజాలు మెరిశాయి. క్రీడ, కళలు, సాహిత్యం ఇలా అన్ని రంగాల్లోనూ తెలుగు వారిని పద్మ అవార్డులు వరించాయి.
స్వర్ణ సింధుకు పద్మ భూషణ్
భారత షట్లర్లకు కలలా మారిన ప్రపంచ ఛాంపియన్‌షిప్ స్వర్ణాన్ని గెలిచి అబ్బురపరిచిన మేటి క్రీడాకారిణి పీవీ సింధును పద్మ భూషణ్ వరించింది. భారత క్రీడాభిమానులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. క్రీడాకారులకే కాదు.. యువత అందరికీ ఆమె ఆదర్శం. సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన సింధు ప్రపంచ బ్యాడ్మింటన్‌లో సత్తా చాటింది. విపరీతమైన పోటీ ఉండే ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో ఏదో ఒక్క పతకం గెలవడమే గొప్ప అనుకుంటున్న తరుణంలో సింధు అద్భుతాలు చేసింది. వరుసగా రెండు కాంస్యాలు (2013, 14), రెండు రజతాలు (2017, 18) సాధించింది. అంతటితో ఆమె ప్రయాణం ఆగిపోలేదు. గత ఏడాది ఏకంగా స్వర్ణం సాధించి ప్రపంచ బ్యాడ్మింటన్ శిఖరంపై కూర్చుంది. ఇవన్నీ ఒకెత్తయితే.. 2016 రియో ఒలింపిక్స్‌లో సాధించిన రజతం మరో ఎత్తు. అప్పుడే ఆమె జాతీయ తారగా అవతరించింది. ఆమె మూడు సూపర్ సిరీస్ టైటిళ్లనూ సాధించింది. 2013లో అర్జున అవార్డు గెలిచిన సింధు.. 2015లో పద్మశ్రీకి ఎంపికైంది. 2016లో ఖేల్‌రత్న దక్కించుకుంది. ఇప్పుడు పద్మభూషణ్ ఆమెను వరించింది.
గ్రామీణ కళాకారుడికి పద్మశ్రీ
అనంతపురం జిల్లా ధర్మవరం మండలం నిమ్మలకుంటకు చెందిన దలవాయి చలపతిరావుకు పద్మశ్రీ లభించింది. ప్రాచీన కళారూపం తోలుబొమ్మలాటకు ఆయన ప్రాణం పోశారు. పదేళ్ల వయసులో చలపతిరావు తోలుబొమ్మలాట మెుదలుపెట్టారు. ఇప్పుడు ఆయన వయసు 80 ఏళ్లు. ఇన్నాళ్లూ.. ఆయన కళే జీవితంగా గడిపారు. ఎన్ని ఒడుదొడుకులు వచ్చినా.. నమ్ముకున్న కళను వదల్లేదు. మారుతున్న అభిరుచులకు అనుగుణంగా తోలుబొమ్మలను తీర్చిదిద్దుతున్నారు. ఈయన జాతీయ శిల్పగురు పురస్కారాన్ని సైతం అందుకున్నారు.
రంగస్థల నటుడు ‘యడ్ల’కు పద్మశ్రీ
శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం మందరాడ గ్రామానికి చెందిన యడ్ల గోపాలరావును ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ అవార్డు వరించింది. నాటక రంగంలో ఆయనకు అయిదు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉంది. 1964లో ‘దేశం కోసం’ అనే సాంఘిక నాటకంతో కళారంగ ప్రవేశం చేశారు. దివంగత యడ్ల రామ్మూర్తి, లక్ష్మమ్మలకు 1950 మే4న ఆయన జన్మించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తోపాటు తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, పశ్చిమబంగాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 5,600కు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. పౌరాణిక, సాంఘిక నాటకాల్లో నటించారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, నక్షత్రకుడు, నారదుడు వంటి పాత్రల్లో విశేష ప్రతిభ చాటారు. బళ్లారి రాఘవ, చిట్టిపూర్ణమ్మ పంతులు, కందుకూరి విశిష్ట పురస్కారాలను అందుకున్నారు. 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డును అందజేసింది.
'కృషీ'వలుడికి పద్మ శ్రీ
తెలంగాణలోని మేడ్చల్ జిల్లా కీసరకు చెందిన చింతల వెంకటరెడ్డిని పద్మశ్రీ వరించింది. సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ వివిధ రకాల ప్రయోగాలను చేపడుతున్న ఆయన గత నాలుగు దశాబ్దాలుగా ఈ విధానంలో పంటలు పండిస్తున్నారు. అంతర్జాతీయ పేటెంట్ పొందిన తొలి భారతీయ రైతుగానూ ఆయన గుర్తింపు దక్కించుకున్నారు. ఎలాంటి రసాయనాలు వినియోగించకుండా పంటలు పండించడం ద్వారా అందరి దృష్టినీ ఆకర్షించారు. పొలంలో నాలుగైదు అడుగుల మేర తవ్వి, మట్టిని బయటికి తీసి దానినే తిరిగి ఎరువుగా, నీటిలో కలిపి పురుగుమందుగా పైర్లపై చల్లే విధానం ద్వారా పంటల దిగుబడిని వెంకటరెడ్డి పెంచారు. ‘ప్రాసెస్ టూ ఇంప్రూవ్ న్యూట్రియంట్ కాంటెంట్ ఆఫ్ సాయిల్ ఇన్ అగ్రికల్చర్ ల్యాండ్స్’ అనే పేరుతో ఈ విధానానికి గాను పేటెంట్ పొందారు.
చదివింది ఇంటరే
వ్యవసాయంలో తొలి పేటెంట్ సాధించి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన వెంకటరెడ్డి 1969లో ఇంటర్ బైపీసీ గ్రూపును ఆంగ్ల మాధ్యమంలో చదివి ఉత్తీర్ణులయ్యారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం కుందనపల్లిలో సేంద్రియ పద్ధతిలో.. ప్రస్తుతం 20ఎకరాల్లో ద్రాక్ష, రెండు ఎకరాల్లో వరి, అల్వాల్‌లో అర ఎకరంలో గోధుమ సాగుచేసి వివిధ పరిశోధనలు చేపడుతున్నారు.
శ్రీభాష్యానికి పద్మశ్రీ
పద్మశ్రీకి ఎంపికైన శ్రీభాష్యం విజయసారథి కరీంనగర్ జిల్లాలోని చేగుర్తిలో 1936లో జన్మించారు. సంస్కృత భాషా పండితులు, ప్రతిభ, పరిశోధన విశ్లేషణ, వ్యాఖ్యాన రీతుల్లో దేశ వ్యాప్తంగా ఖ్యాతి పొందిన ఆణిముత్యం శ్రీభాష్యం విజయ సారథి. సంస్కృతంలో దాదాపు 100 పుస్తకాలను రాసిన గొప్ప సాహితీవేత్త. చిన్నతనంలో ఉర్దూ మీడియంలో చదివినా.. సంస్కృతంలోనూ మంచి పట్టు ఉంది. మందాకిని, ప్రవీణ భారతం, భారత భారతి వంటి పుస్తకాల ద్వారా భారతదేశ చరిత్ర, సంస్కృతి సంప్రదాయాలను వివరించారు.
ఇదీ చదవండి: