ITDA: జిల్లాల పునర్విభజన పూర్తయి పాలన కూడా ప్రారంభమైనా.. సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)ల విషయంలో మాత్రం సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం ఐటీడీఏలను యథాతథంగా కొనసాగిస్తామని చెబుతున్నా.. అది ఏ మేరకు సాధ్యమనేది ప్రశ్నగా ఉంది. ప్రాథమికంగా ఒక జిల్లాకు ఒక ఐటీడీఏ ఉండాలని 2001లో కేంద్రం మార్గదర్శకాలిచ్చింది. కానీ కొత్త జిల్లాల ఏర్పాటుతో ఒకే జిల్లా పరిధిలోకి రెండు, మూడు ఐటీడీఏలు వచ్చాయి.
కొత్తగా ఏర్పాటైన అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రమైన పాడేరు, పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రమైన పార్వతీపురం పట్టణాలే ఐటీడీఏ కేంద్రాలుగా ఉన్నాయి. వీటిని యథాతథంగా కొనసాగిస్తే పాలనపరంగా ఇబ్బందులు ఎదురుకానున్నాయి. వీటికి అదనంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో రంపచోడవరం, చింతూరు ఐటీడీఏలు అదనంగా చేరాయి. పార్వతీపురం మన్యం జిల్లాలోకి సీతంపేట ఐటీడీఏ చేరింది. మొత్తంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో మూడు, పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలోకి రెండు ఐటీడీఏలు వచ్చాయి. దీనివల్ల భవిష్యత్తులో వాటి మనుగడకు ముప్పు ఉన్నట్లు గిరిజన సంఘాల నేతలు పేర్కొంటున్నారు.
- శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలను కలిపి పార్వతీపురం కేంద్రంగా పార్వతీపురం మన్యం జిల్లాను ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసింది. పూర్వపు శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట ఐటీడీఏలో 20 మండలాలుండగా అందులోని 4 మండలాలు పార్వతీపురం మన్యం జిల్లాలోకి వచ్చాయి. ఇప్పటికే పార్వతీపురం ఐటీడీఏ అక్కడ ఉండగా సీతంపేట ఐటీడీఏ కొత్తగా వచ్చి చేరింది. రెండింటిని కొనసాగిస్తామని చెబుతూనే సీతంపేట ఐటీడీఏ వ్యవహారాల్ని పర్యవేక్షించే డిప్యూటీ డైరెక్టర్(డీడీ) పోస్టును శ్రీకాకుళం జిల్లాలోని గిరిజన ప్రాంతాల పర్యవేక్షణకు గాను బదిలీ చేసింది. కానీ పీవో స్థాయి అధికారిని మాత్రం కొనసాగిస్తోంది. ఇప్పుడు పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏలకు ఒకే డీడీ స్థాయి అధికారి ఉన్నారు.
- సీతంపేట కేంద్రంలోని మిగతా 16 మండలాలు శ్రీకాకుళం జిల్లాలోనే కొనసాగుతున్నాయి. ఈ మండలాల పీవో మాత్రం పార్వతీపురం మన్యం జిల్లాలో ఉంటున్నారు. ఛైర్మన్‌గా అదే జిల్లా కలెక్టరు వ్యవహరిస్తున్నారు. కానీ మండలాలు శ్రీకాకుళం జిల్లా కలెక్టరు పరిధిలోకి వస్తున్నాయి. దీంతో గిరిజనులు ఏ కలెక్టరు వద్దకు వెళ్లాలన్నది ప్రశ్నగా మారుతుంది. ఇక్కడ మెళియాపుట్టి, మందస, పాతపట్నం ప్రాంతాలతో ప్రత్యేక ఐటీడీఏని ఏర్పాటు చేయాలని గిరిజనులు కోరుతున్నారు.
- విశాఖ జిల్లాను విశాఖ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలుగా విభజించారు. విశాఖ జిల్లాలోని పాడేరు, తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరం, చింతూరు ఐటీడీఏలను పాడేరు కేంద్రంగా ఏర్పడే అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోకి తీసుకొచ్చారు. చింతూరు ఐటీడీఏకు మూడు నెలలుగా పీవోను నియమించలేదు. రంపచోడవరం పీవోకు ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించింది. రంపచోడవరం నుంచి పాడేరు 250 కి.మీ ఉండగా చింతూరు పరిధిలోని మండలాలకు దాదాపు 350 కి.మీ పైగా దూరంలో ఉంది. తెలంగాణలోని ఖమ్మం జిల్లా సరిహద్దు గ్రామాల్లోని ఏపీకి చెందిన మండలాల వారు పాడేరుకు వెళ్లాలి. రహదారి సదుపాయం పూర్తిగా లేదు. రంపచోడవరం కేంద్రంగా ఐటీడీఏను కొనసాగించాలని డిమాండు ఉంది.
- కేఆర్‌పురం ఐటీడీఏలో వేలేరుపాడు, కుక్కునూరు, పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమల్లి మండలాలున్నాయి. ఇవి ఏలూరు జిల్లా కేంద్రం పరిధిలోకి వస్తున్నాయి. కేఆర్‌పురం ఐటీడీఏ పరిధిలోని గిరిజనులు తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరం, చింతూరు ఐటీడీఏలతో కలిపి ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని డిమాండు చేస్తున్నారు.
ఇదీ చదవండి: