పులిచింతల జలాశయంలో నీటి నిల్వ గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో ఆదివారం సాయంత్రం 6 గంటలకు 13వ రేడియల్ గేటును ఒక అడుగు మేర ఎత్తి వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా 44 టీఎంసీలకు చేరుకోవడంతో నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు ఇంజినీర్లు తెలిపారు. వరద నీటితో విద్యుదుత్పత్తికి తెలంగాణ జెన్‌కో అధికారులు ఆదివారం ఉదయం 4 యూనిట్లను రన్ చేశారు. ఇందుకు 13,500 క్యూసెక్కుల వరద నీరు వినియోగిస్తున్నారు. ఎగువన నుంచి వరద వస్తుండటం, నాగార్జునసాగర్ పరివాహకం నుంచి 20,000 క్యూసెక్కుల నీరు చేరడంతో.. పులిచింతల నుంచి దిగువకు 24,690 క్యూసెక్కులు వదులుతున్నారు. నీటి ప్రవాహం స్థాయిని అనుసరించి గేట్ల నిర్వహణకు వీలుగా పదో గేటు వద్ద ఉన్న తెలంగాణ పోలీసు చెక్‌పోస్టును తీసివేయాలని ఆ రాష్ట్ర జెన్‌కో అధికారులను కోరారు. ప్రాజెక్టు ఈఈ శ్యాంప్రసాద్ ఆధ్వర్యంలో డీఈఈలు రఘునాథ్, అరుణకుమారి, ఏఈలు మహాలక్ష్మి, రాజశేఖర్, రాజు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆదివారం రాత్రి 8గంటలకు ప్రాజెక్టులో 44.08 టీఎంసీల నీరు ఉంది.
ప్రకాశం బ్యారేజీకి పెరగనున్న వరద...
కృష్ణా నదిపై పులిచింతలలో విడుదల చేసిన వరద సోమవారం ఉదయానికి విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి చేరవచ్చని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈనెల రెండో తేదీ నుంచి ఇప్పటి వరకు బ్యారేజీ నుంచి సుమారు 10 టీఎంసీల నీరు సముద్రం పాలైంది. కృష్ణా డెల్టాలోని పంట కాల్వలకు ఆదివారం 2,535 క్యూసెక్కులు ఇస్తున్నారు. బ్యారేజీ 6 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి 4,452 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేశారు. ఎగువ నుంచి బ్యారేజీకి 8,651 క్యూసెక్కులు వస్తోంది. సోమవారం నుంచి వరద నీరు పెరిగే అవకాశం ఉంది.
ఇదీ చదవండి:
VIJAYSAI REDDY: రాష్ట్రానికి కేంద్రం ద్రోహం చేస్తోంది: విజయసాయిరెడ్డి