ఏటా నగర ప్రజలను వినోదం, విజ్ఞానం, విక్రయాలతో అలరిస్తున్న నుమాయిష్ తొలిసారిగా వాయిదా పడింది. ఈ నెల 31 వరకు కొవిడ్ నిబంధనలు ఉన్న నేపథ్యంలో ప్రదర్శనను వాయిదా వేస్తున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ స్పష్టం చేసింది. ఏటా జనవరి ఒకటిన ప్రారంభమై ఫిబ్రవరి 15 వరకు... 46 రోజుల పాటు ప్రదర్శన సాగేది. రోజుకు 40 వేల పైచిలుకు సందర్శకులతో మొత్తం 20 లక్షలకు పైగా పాల్గొనేవారు. స్టాళ్లు, వినోద, విజ్ఞాన కేంద్రాల వద్ద నగర ప్రజలు సందడి కనిపించేది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల వ్యాపారులు నుమాయిష్‌లో స్టాళ్లు ఏర్పాటు చేసేవారు.
నెలకొన్న స్తబ్ధత
హైదరాబాద్ నాంపల్లి గ్రౌండ్స్ 23 ఎకరాల ప్రాంగణంలో నుమాయిష్ నిర్వహిస్తుంటారు. ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఎన్నుకోబడిన కమిటీ వీటి నిర్వహణను పర్యవేక్షిస్తుంటుంది. దాదాపు 2 వేల స్టాళ్లలో వస్త్రాలు, తినుబండారాలు, బొమ్మలు, గృహోపకరణాలను ఉంచుతారు. కొత్త ఏడాది నిర్వహించే ఈ ప్రదర్శన కోసం వ్యాపారులు, సందర్శకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. హైదరాబాద్ నగర జీవనంలో ఎంతో ప్రత్యేక స్థానం కలిగిన నుమాయిష్ ప్రాంగణం వద్ద ఈసారి స్తబ్ధత నెలకొందని నిర్వాహకులు తెలిపారు.
కరోనానే కారణం
నుమాయిష్ కోసం నవంబర్ నుంచే పనులు ప్రారంభమై డిసెంబర్ 15 లోగా పూర్తిచేసేవారు. తక్కువ రేటులో లభ్యమై వ్యాపారాన్నిచ్చే ఇక్కడి స్టాళ్ల కోసం వ్యాపారులు పెద్దసంఖ్యలో పోటీ పడుతుంటారు. ఇప్పటికే పలువురు స్టాళ్లను బుక్ చేసుకోగా.. ప్రదర్శన ప్రారంభంపై నెలకొన్న స్తబ్ధత నిర్వాహకులను అయోమయంలో పడేసింది. పెద్ద సంఖ్యలో వచ్చే సందర్శకులు కొవిడ్ నిబంధనలు పాటించడం సవాలుతో కూడుకోవటంతో.... ఎగ్జిబిషన్ సొసైటీ వాయిదా నిర్ణయం తీసుకుంది. కరోనా కొత్త స్ట్రెయిన్, చలికాలం వైరస్ వ్యాప్తి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు, మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు.
జనవరి 31 న తుదినిర్ణయం
రెండేళ్ల క్రితం జరిగిన అగ్ని ప్రమాదం మరుసటేడాది కొనుగోళ్లు, సందర్శకుల తాకిడిపై ప్రభావం చూపింది. ఈసారి కొవిడ్ నిబంధనలతో మరోసారి నుమాయిష్ నిర్వహణకు ఆటంకం ఏర్పడింది. జనవరి 31 న తుదినిర్ణయం తీసుకుంటామని ఎగ్జిబిషన్ సొసైటీ సంకేతాలిచ్చినా.. కొవిడ్ భయాల కారణంగా నుమాయిష్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నట్లే కనిపిస్తోంది.