ఈ ఏడాది పీజీ వైద్య విద్య కౌన్సిలింగ్లో ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో సీట్లు పొందిన వారి పరిస్థితి గందరగోళంగా మారింది. ప్రభుత్వం నూతన ఫీజు విధానాన్ని అమల్లోకి తేవటంతో పీజీ ప్రవేశాలు నిలిపివేస్తామని.. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు తెలిపాయి. కౌన్సెలింగ్లో సీట్లు పొందిన విద్యార్ధులు చేరేందుకు కాలేజీలకు వెళితే అనుమతించలేదు. దీంతో ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ అధికారులను నిలదీశారు. ఈ నేపథ్యంలో వర్శిటీ అధికారులు ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు సర్క్యులర్ జారీ చేశారు. విద్యార్ధులను కాలేజీల్లో ఎందుకు చేర్చుకోవట్లేదో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
ఈ క్రమంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వర్శిటీ అధికారులకు ప్రత్యుత్తరమిచ్చాయి. ఫీజులు కుదించటంతో నిర్వహణ భారం పెరిగిపోతుందని వివరించారు. విద్యార్ధులు చెల్లించే ఫీజు కన్నా కాలేజీలు పీజీ విద్యార్ధులకు చెల్లించే స్టైఫండ్ అధికంగా ఉన్నందున తాము పీజీ ప్రవేశాలకు అనుమతించలేమని కాలేజీలు తెలిపాయి. దీంతో వర్శిటీ అధికారులు మరోసారి కాలేజీలకు సర్క్యులర్ జారీ చేయనున్నారు. మరోవైపు తమకు కౌన్సెలింగ్లో సీటు వచ్చినా కాలేజీ యాజమాన్యాలు చేర్చుకోవట్లేదంటూ పలువురు హైకోర్టును ఆశ్రయించారని వర్శటీ వీసీ డా.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. దీనిపై ప్రైవేట్ మెడికల్ కాలేజీలతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.