NTR HEALTH UNIVERSITY: ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ పదవి నుంచి కె.శంకర్ తప్పుకున్నారు. తన రాజీనామా పత్రాన్ని ఆయన సోమవారం అర్ధరాత్రి ఉపకులపతి శ్యామ్‌ప్రసాద్‌కు అందజేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ఆయన తిరిగి తన మాతృశాఖ డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ)కి వెళ్లారు. ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌గా విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణాధికారి చందల శ్రీనివాసరావును నియమిస్తూ ఆదేశాలను జారీ చేశారు. మంగళవారం ఉదయం ఆయన బాధ్యతలు చేపట్టారు. మరోవైపు కొత్త రిజిస్ట్రార్ నియామకానికి నోటిఫికేషన్‌ను మంగళవారం విశ్వవిద్యాలయం జారీ చేసింది. ఇందుకు దరఖాస్తును ఆగస్టు 8వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా విశ్వవిద్యాలయానికి చేరేట్లు పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫారాలను విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో ఉంచారు.
ఉన్నతాధికారుల ఒత్తిడితోనే?
రిజిస్ట్రార్ శంకర్ పదవీకాలం నవంబర్ వరకే ఉంది. అయినా ప్రభుత్వ ఉన్నతాధికారుల ఒత్తిడి వల్లే ఆయన అర్ధంతరంగా రాజీనామా చేసినట్లు సమాచారం. గత ఏడాది గుంటూరు పరిధిలోని ఓ ప్రైవేటు వైద్య కళాశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా వెళ్లినందుకే పదవీకాలానికి గండి పడినట్లు సమాచారం. పది రోజుల కిందటే దీనిపై వైద్య ఆరోగ్య శాఖ అధికారుల నుంచి ఒత్తిడి రాగా, అప్పటికే 24, 25 స్నాతకోత్సవాల తేదీలను ప్రకటించడంతో గడువు కోరారు. గత శుక్రవారం స్నాతకోత్సవం ముగిసిన వెంటనే సోమవారం రాజీనామా చేయాలని ఆయనపై ఒత్తిడి పెరిగింది. రాత్రి 11 గంటల సమయంలో రాజీనామా పత్రాన్ని వీసీకి అందజేసి రిజిస్ట్రార్ శంకర్ వెళ్లిపోయారు. ప్రస్తుత పీజీ వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చే సమయంలో రిజిస్ట్రార్‌ను అర్ధాంతరంగా పంపడంపై పలు విమర్శలు వస్తున్నాయి. తమ కళాశాల పరిపాలన, యాజమాన్య సీట్ల కేటాయింపు విషయంలో రిజిస్ట్రార్ మాట వినలేదనే ఉక్రోషంతో ఆ యాజమాన్యం... వైద్య ఆరోగ్య శాఖ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి, తమకు అనుకూలమైన మరొకరిని సీట్లో కూర్చోబెట్టేందుకే శంకర్‌తో రాజీనామా చేయించారని సమాచారం
ఇవీ చదవండి: