‘సార్ మా ఆయన లోపల చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి ఎలా ఉందో చెప్పరూ.’ ‘మా అమ్మ ఐసీయూలో ఉన్నారు. ఆరోగ్యం ఎలా ఉంది? ఆహారం ఏమైనా తీసుకుంటోందా? గాలి పీల్చుకుంటోందా? చూసే అవకాశం ఉందా? లోపలికి ఎప్పుడు పంపిస్తారు? ఎంతసేపైనా వేచి ఉంటా’ అని వైద్యులు, సిబ్బందిని కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు. రాష్ట్ర కొవిడ్ ఆస్పత్రుల వద్ద ఈ దృశ్యాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కళ్లముందే మృతదేహాలు తరలిపోతుంటే వీరు మరింత ఆందోళన చెందుతున్నారు. విజయవాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వైరస్ బాధితురాలు ఒకరు ‘ఆయాసంగా ఉంది.. ఊపిరాడట్లేదు.. ఎవరూ పట్టించుకోవట్లేదు’ అని సెల్ఫీ వీడియోను మీడియాకు విడుదల చేయడం అక్కడి పరిస్థితులను స్పష్టం చేస్తోంది. గత నెలలో శ్వాస సమస్యతో ఆస్పత్రిలో చేరిన విజయవాడ వన్‌టౌన్‌కు చెందిన వృద్ధుడు అదే రోజు చనిపోయాడు. కానీ భార్యకు తెలియదు. పది రోజుల తర్వాత పోలీసులు జోక్యం చేసుకోగా ఆయన మరణవార్త తెలిసింది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రోగుల వద్దకు ఆప్తులను పంపడంలో ఇబ్బందులున్నా.. వారిని కనీసం సీసీ కెమెరాల ద్వారా చూపిస్తూ ఆరోగ్య పరిస్థితుల గురించి వివరించే ప్రయత్నాలూ జరగడం లేదు.
ప్రవేశమార్గం వరకే..
కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి, ప్రకాశం నాలుగు జిల్లాల నుంచి కరోనా సోకిన వృద్ధులు, చిన్నపిల్లలను విజయవాడలోని రాష్ట్ర కొవిడ్ ఆసుపత్రికి తీసుకొస్తున్నారు. అక్కడ ప్రవేశమార్గం దగ్గర రోగిని విడిచిపెట్టి.. కుటుంబసభ్యులను బయటకు వెళ్లాలని చెబుతున్నారు. ఆ తర్వాత రోగి విషయాలేవీ కుటుంబసభ్యులకు తెలియడం లేదు. గత వారం ఓ మధ్య వయస్కురాలు తనకు గాలి ఆడటం లేదని.. వైద్యులకు చెప్పాలని కుమారుడికి ఫోన్ చేసి రోదించింది. మరికొందరి పరిస్థితీ ఇలాగే ఉన్నట్లు తెలుస్తోంది. రాత్రివేళ శ్వాస అందకపోయినా, మరే తీవ్రమైన అనారోగ్య సమస్య వచ్చినా త్వరగా స్పందించడం లేదన్న ఆవేదన బాధితుల కుటుంబసభ్యుల్లో వ్యక్తమవుతోంది.
తల్లి ఆరోగ్యం గురించి తెలుసుకోలేకపోతున్నా
రోగులు కోలుకుని మాట్లాడే స్థితి ఉంటే వారే తమవారికి ఫోన్లు చేస్తున్నారు. ఇది అందరికీ సాధ్యం కాదు. పడక వద్ద సెల్‌ఫోన్ ఛార్జింగ్ సదుపాయం లేదు. కొందరు రోగులు మంచం దిగలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో అరకొర సమాచారంతో ఆస్పత్రుల వెలుపల కుటుంబసభ్యులు కాపుకాస్తూ మానసికంగా కుంగిపోతున్నారు. కొన్ని సందర్భాల్లో చిరుద్యోగులతో లోపలకు ఫోన్లు పంపి, తమవాళ్లతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. విజయవాడ జీజీహెచ్‌లో ఈ మధ్య రోగుల సమాచారాన్ని వైద్యులే చెప్పేలా ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేసినా పెద్దగా ఫలితం లేదు. ఈ కేంద్రంలో చీటీ రాసిచ్చిన కుటుంబసభ్యులకు వివరాలన్నీ స్పష్టంగా తెలియజేయాల్సి ఉండగా.. అరకొరగానే చెబుతున్నారు. ‘నిన్న మీకేం చెప్పారు? ఇప్పుడూ అదే పరిస్థితి. చూద్దాం.. ఇక వెళ్లండి’ అంటూ పంపేస్తున్నారని తల్లి ఆరోగ్యం గురించి ఓ కుమారుడు వాపోయాడు. అయితే.. రోగుల ఆరోగ్యస్థితి గురించి కేస్ షీటు చూసి వాళ్ల సంబంధీకులకు చెబుతున్నామని విజయవాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ నాంచారయ్య, కర్నూలు ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్ నరేంద్రనాథ్‌రెడ్డి చెప్పారు.
ఆదోని వాసి పరిస్థితి ఘోరం
ఓ వ్యక్తికి గత నెలలో పక్షవాతం వచ్చింది. చికిత్స కోసం వెళ్లి కర్నూలు జీజీహెచ్‌లో పరీక్ష చేయించగా వైరస్ సోకినట్లు తేలింది. ఆస్పత్రిలో చేర్చుకున్న వైద్యులు కుటుంబసభ్యులను బయటకు పంపించారు. ఆయనకు ఏం చికిత్స చేశారో వారికి తెలియలేదు. ఓ చిరుద్యోగి ద్వారా మాత్రమే అడపాదడపా సమాచారాన్ని పొందారు. 2 వారాల తర్వాత ఆయన మరణించినట్లు చెప్పారు. అసలు ఆయనకు ఏం చికిత్స చేశారు, మరణానికి కారణాలేంటో కుటుంబసభ్యులకు పూర్తిస్థాయిలో తెలియలేదు.
ఇదీ చదవండి:
వైద్య ఖర్చు వెయ్యిదాటితే ఆరోగ్య శ్రీ ...నేటి నుంచి ఆరు జిల్లాల్లో అమలు !