అరకు మాజీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యల ఘటనలో కీలకంగా వ్యవహరించింది మావోయిస్టుపార్టీ ఏరియా కమిటీ సభ్యురాలు సాకే కళావతి అలియాస్ భవాని(45) అని జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) తేల్చింది. జంట హత్యలు జరగటానికి 15 రోజుల మందే కళావతి, ఆమె భర్త మావోయిస్టు పార్టీ జోనల్ కమిటీ సభ్యుడు కాకూరి పండన్న, మరో 40 మంది దళంతో కలిసి డుంబ్రిగూడలో మకాం వేశారని వెల్లడించింది.
2018 సెప్టెంబర్ 23న జరిగిన ఈ ఘటనకు సంబంధించి విజయవాడలోని ప్రత్యేక న్యాయస్థానంలో శుక్రవారం ఎన్ఐఏ అనుబంధం అభియోగపత్రం దాఖలు చేసింది. ఈ కేసులో తొమ్మిది మంది నిందితులపై గతంలోనే ఎన్ఐఏ(NIA) అభియోగపత్రం దాఖలు చేసింది. 'కళావతి ఇన్సాస్ రైఫిల్ వినియోగించారు. అప్పటి ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ సివేరి సోమను హత్య చేసిన బృందానికి కావాల్సిన వనరులు, సరంజామా అంతా ఆమె సమకూర్చారు. కళావతి 20 ఏళ్ల కిందటే మావోయిస్టు పార్టీలో చేరారు' అని దానిలో వివరించింది.
జంట హత్యల ఘటనపై తొలుత స్థానిక పోలీసులు కేసు నమోదు చేయగా..2018 డిసెంబర్ 6న ఎన్ఐఏ(NIA)కు బదిలీ అయ్యింది. హైదరాబాద్లోని ఎన్ఐఏ కార్యాలయం కేసు నమోదు చేసి దర్యాప్తు చేసింది. అందులో వెలుగుచూసిన అంశాలతో శుక్రవారం అనుబంధ అభియోగపత్రం దాఖలు చేసింది.
ఇదీ చదవండి
COVAXIN: పూర్తి స్థాయి అనుమతులకు దరఖాస్తు చేసుకోవాలని యూఎస్ఎఫ్డీఏ సూచన