విశాఖ పరవాడ ఫార్మాసిటీ గ్యాస్ లీక్ ఘటన, కర్నూలు నంద్యాలలో ఆగ్రో ఫ్యాక్టరీలో గ్యాస్ లీకేజీపై ఎన్జీటీ కమిటీ ఏర్పాటు చేసింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, ఆయా జిల్లాల కలెక్టర్లు, ప్రొఫెసర్ రామచంద్రమూర్తి, ప్రొఫెసర్ పులిపాటి కింగ్లతో కమిటీ ఏర్పాటైంది. మూడు నెలల్లో రెండు ఘటనలపై నివేదిక ఇవ్వాలని కమిటీకి ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. పూర్తి నష్ట పరిహారం అంచనా, భవిష్యత్ భద్రతా సూచనలతో నివేదిక ఇవ్వాలని సూచించింది. ఘటన బాధ్యులపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సరైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. పరవాడ ఫార్మాసిటీ కంపెనీ మృతులకు ప్రకటించిన 35 లక్షల పరిహారం చెల్లించాలని.. గాయపడిన నలుగురికి మధ్యంతర పరిహారంగా 5 లక్షల చొప్పున జిల్లా కలెక్టర్ వద్ద జమ చేయాలని పేర్కొంది. జిల్లా కలెక్టర్ అస్వస్థతకు గురైన నలుగురికి ఆ నగదు ఇవ్వాలని ఎన్జీటీ స్పష్టం చేసింది.
కర్నూలు నంద్యాలలో ఆగ్రో ఫ్యాక్టరీలో గ్యాస్ లీకేజీ ఘటన మృతుడి కుటుంబాన్ని 15 లక్షలు, గాయపడిన వారికి 5 లక్షల చొప్పున మధ్యంతర పరిహారం చెల్లించాలని కంపెనీకి ఆదేశాలు జారీ చేసింది. పరవాడ గ్యాస్ లీకేజీ ఘటనలో ఇచ్చిన ఆదేశాలు ఇక్కడ కూడా వర్తిస్తాయన్న ఎన్జీటీ స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: రూ.20వేల కోట్ల ఆస్తిని...30 లక్షల కుటుంబాలకు ఇవ్వబోతున్నాం: సీఎం