విజయవాడ కార్పొరేషన్ కొత్త కార్యాలయ భవన నిర్మాణం మూడేళ్ల తర్వాత మొదలైంది. పనులకు ఇటీవలే రెండో సారి కొబ్బరికాయ కొట్టారు. ప్రణాళికలు ఘనంగా ఉన్నా కేటాయింపులు అరకొరగా ఉండడంతో భవిష్యత్తులో నిధుల సమస్య ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇదీ ప్రణాళిక..
కార్పొరేషన్ ప్రస్తుత కార్యాలయ భవనం ఇరుగ్గా మారింది. పలు విభాగాలు నగరంలోని ఇతర చోట్ల నడుస్తున్నాయి. అవసరాలకు తగ్గట్లు సువిశాల భవనాన్ని నిర్మించేందుకు గత కౌన్సిల్‌లో తీర్మానం చేశారు. రూ. 32 కోట్లతో జీ ప్లస్ 8 తరహాలో భవనం నిర్మించేందుకు నిర్ణయించారు. నగరపాలిక అవసరాలకు పోను, మిగిలిన విస్తీర్ణాన్ని హోటళ్లు, బ్యాంకులు, ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు కార్యాలయాలకు అద్దెకు ఇవ్వాలని భావించారు. దీని ద్వారా నెలకు రూ. 20 లక్షల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేశారు. 2016, సెప్టెంబరులో దీని నిర్మాణం మొదలైంది.
పనులకు బ్రేక్..
భవనాన్ని 2017, సెప్టెంబరు నాటికి పూర్తి చేయాలని గుత్తేదారుకు గడువు నిర్దేశించారు. పలు కారణాలతో ఆలస్యమైంది. గడువు పొడిగించాలని గుత్తేదారు కోరారు. ఇదే సమయంలో విజయవాడ నగరంలో నదీ, కాలువ ముఖ అభివృద్ధికి ప్రణాళికలను సిద్ధం చేయాలని అప్పటి సీఎం చంద్రబాబు ఆదేశించారు. నది పక్కనే కార్పొరేషన్ భవనం ఉంది. దీనిని తొలగించాల్సి వస్తుందన్న అనుమానంతో పనులు నిలిపేశారు. అప్పటి వరకు గుత్తేదారుకు రూ. 9 కోట్లు వరకు చెల్లించారు.
కొత్తగా టెండరు.. అరకొరగా నిధులు
ఇటీవల కార్యాలయ నిర్మాణ విషయాన్ని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. పనులు చేపట్టేందుకు పాత గుత్తేదారు ముందుకు వచ్చారు. పాత ధరలను సవరించి ప్రతిపాదనలు వీఎంసీ నుంచి పైకి వెళ్లాయి. వీటిని ప్రభుత్వం తిరస్కరించి, మళ్లీ టెండరు పిలవాలని ఆదేశించడంతో కొత్త గుత్తేదారును ఎంపిక చేశారు. వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం కార్పొరేషన్‌కు మంజూరైన నిధుల నుంచి రూ.8 కోట్లను కేటాయించారు. ప్రస్తుత ధరల ప్రకారం అంచనా వ్యయం రూ.40 కోట్లకు పెరిగింది. నిధులకు ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి ప్రత్యేక గ్రాంటు వస్తేనే ఈ భవనం పూర్తయ్యే అవకాశాలున్నాయి.
ఇదీ చదవండి: