విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో దక్షిణ భారత గో-ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం మూడో రైతు సమ్మేళనాన్ని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రారంభించారు. దక్షిణాది రాష్ట్రాల్లో గో-ఆధారిత ప్రకృతి వ్యవసాయం ద్వారా పండిస్తున్న పంటల ఉత్పత్తులను ప్రదర్శనగా ఉంచిన స్టాళ్లను గవర్నర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. పెరిగిన జనాభా అవసరాలు తీర్చేందుకు అధిక దిగుబడి కోసం ప్రాణాంతకమైన రసాయన మందులను విచక్షణారహితంగా వినియోగిస్తున్నారని ఆవేదన చెందారు. ఇలాంటి పరిస్థితుల్లో మార్పు తీసుకొచ్చేందుకు ప్రకృతి వ్యవసాయం ఓ విప్లవంగా ముందుకు సాగుతోందన్నారు. పూర్వీకుల నాటి వ్యవసాయ విధానాలు అనుసరణీయమని హితవు పలికారు. పెట్టుబడి లేని వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తున్న విధానంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందుందని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు అన్నారు. మున్ముందు సేంద్రీయ వ్యవసాయ విధానాలను రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా ప్రోత్సహిస్తుందన్నారు. త్వరలో చిరుధాన్యాల బోర్డును ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.
మూడు రోజులపాటు నిర్వహించే ఈ సమ్మేళనంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఉద్యానశాఖ కమిషనర్ పి చిరంజీవి చౌదరి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు టి విజయకుమార్, ఆర్ఎస్ఎస్ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి వి. భాగయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన