నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ శాసనసభ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలో... మూడు సామాజికవర్గాల ఓట్లు కీలకం కానున్నాయి. తమ వర్గపు ఓట్లతోపాటు ఇతర వర్గాలను ఆకర్షిస్తామన్న భావనతో ఉన్న పార్టీలు.. ఇప్పుడు సంశయంతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఏ మూడు సామాజికవర్గాలైతే ఎన్నికలను ప్రభావితం చేస్తాయని లెక్కలు కట్టారో.. ఆ విభిన్న వర్గాల వ్యక్తులకే మూడు ప్రధాన పార్టీలు టికెట్లిచ్చాయి. మొత్తం ఓట్లలో ఈ మూడు వర్గాలకు చెందిన ఓట్లే.. 43 శాతం ఉన్నాయి. దీంతో పార్టీలన్నీ ఓట్ల కోసం పాట్లు పడాల్సి రావొచ్చు.
ఓట్ల లెక్క ఇలా..
నాగార్జునసాగర్ నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 19 వేల 745 మంది ఓటర్లున్నారు. యాదవ సామాజికవర్గం నుంచి అత్యధికంగా... 36 వేల మందికిపైగా ఓటర్లున్నారు. ఇక రెండో స్థానంలో గిరిజనులు నిలవగా... వారి సంఖ్య 34 వేల దాకా ఉంది. రెడ్డి సామాజికవర్గం నుంచి 24 వేల ఓట్లదాకా ఉన్నాయి. మొత్తం ఓట్లతో ఈ మూడు వర్గాల ఓటర్లను లెక్కిస్తే.. 43 శాతం అవుతోంది.
ఇవే గణాంకాలను దృష్టిలో ఉంచుకున్న పార్టీలు.. వాటి ఆధారంగానే ఆయా వర్గాలకు చెందిన వ్యక్తులకే అభ్యర్థిత్వాలు ఖరారు చేశాయి. దీంతో ఒక వర్గానికి చెందిన ఓట్లు మరో వర్గానికి పోలవుతాయా అన్నది సందిగ్ధంగా మారింది. ప్రత్యర్థుల సామాజికవర్గాలను పక్కన పెట్టి... మిగతా వర్గాలపై దృష్టిసారిస్తే మేలన్న అభిప్రాయం ఆయా పార్టీల్లో కనిపిస్తోంది. అయితే ఇంకా సామాజికవర్గాల ఆధారంగా ఓట్లు వేసే పరిస్థితి ఉందా? అన్న ఆలోచన సైతం... అభ్యర్థుల్లో కనపడుతోంది.
ఎవరి వ్యూహాలు వారివే..
తనకున్న రాజకీయ అనుభవం, పరిచయాలతో ఏ ఒక్క వర్గానికో పరిమితం కాకుండా... అందర్నీ కలుపుకొని ఓట్లు కూడగట్టుకుంటానన్న విశ్వాసంతో జానారెడ్డి ఉన్నారు. అటు సంక్షేమ కార్యక్రమాలు, సాగర్ ఎడమ కాల్వ కింద చేపట్టిన పథకాలు తమకు అన్ని వర్గాల ఓట్లు తెచ్చిపెడతాయని అధికార పార్టీ భావిస్తోంది. చిన్నపరెడ్డి, కోటిరెడ్డి వంటి వారికి సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని చెబుతూ... ఆ వర్గంతోపాటు ఇతరుల ఓట్లూ గంపగుత్తగా తమకే పడతాయన్న విశ్వాసంతో గులాబీ పార్టీ ఉంది. ఇక తండాల్లో కనీస సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్న వారి సమస్యలు పరిష్కరించేలా... ఆ వర్గానికి చెందిన వ్యక్తికే టికెట్ ఇచ్చామంటూ భాజపా ప్రచారానికి సిద్ధమవుతోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ తరహాలోనే సాగర్‌లోనూ అద్భుతం చేస్తామన్న భావనతో ఉన్న కమల దళం... అందుకు అనుగుణంగా ప్రచారానికి కీలక నేతల్ని రంగంలోకి దించుతోంది. ఇలా మూడు పార్టీలు ఓట్ల కోసం... రకరకాల వ్యూహాలకు సన్నద్ధమవుతున్నాయి.
ఇవీచూడండి: చివరిరోజే నామినేషన్లు వేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు