రాష్ట్రంలో కరెంటు కోతల వల్ల ప్రజలు అవస్థలకు గురవుతున్నారని జనసేన నేత నాగబాబు అన్నారు. వేసవిలో విద్యుత్ కొరతను నివారించేందుకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని వైకాపా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాదుడే.. బాదుడంటూ గతంలో వ్యంగ్యంగా విమర్శనాస్త్రాలు సంధించిన జగన్ ఇప్పుడు విద్యుత్తు సంక్షోభం అధిగమించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో ప్రజలకు వివరించాలన్నారు. కరెంటు కోతలే ఉండవన్నసీఎం జగన్ కోతలు ఏమయ్యాయి? అని నిలదీశారు.
విద్యుత్ కొరత కారణంగా పరిశ్రమలు మూసేస్తే.. కార్మిక కుటుంబాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఉత్పాదకత కొరత కారణం చూపి గత నెలలో రాష్ట్రవ్యాప్తంగా సహకార రంగంలోని ఆరు చక్కెర కర్మాగారాలు మూసివేశారన్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వాలు సౌర విద్యుత్, పవర్ గ్రిడ్, విద్యుత్ కాంట్రాక్ట్ అని రకరకాల ప్రయోగాలతో వేల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేసిందని విమర్శించారు. రాష్ట్రంలో సమృద్దిగా నీటి వనరులు ఉన్నప్పటికీ.. విద్యుత్తు ఉత్పాదక ప్రయత్నాలు చేయలేకపోవడం ప్రస్తుత, గత పాలకుల అసమర్థతకు నిదర్శనమని దుయ్యబట్టారు. విద్యుత్ సంక్షోభం అధిగమించేందుకు జనసేనకు ఓ ప్రణాళిక ఉందని నాగబాబు తెలిపారు.
ఇదీ చదవండి: జగన్ పాలనలో రాష్ట్రం.. నరకాంధ్రప్రదేశ్గా మారింది: చంద్రబాబు