ఐస్‌క్రీం ఫ్రీగా ఇవ్వలేదని చిరు వ్యాపారిపై ఓ యువకుడు కత్తితో పొడిచి చంపేందుకు యత్నించిన ఘటన.. కృష్ణా జిల్లాలోని అజిత్‌సింగ్‌నగర్ పోలీసుస్టేషన్‌కు కూతవేటు దూరంలో జరిగింది. న్యూరాజరాజేశ్వరీపేటలో రాజులపాటి రవిప్రసాద్ అనే వ్యక్తి ఐస్‌క్రీం హోల్‌సేల్ వ్యాపారం చేస్తుంటాడు. అతని వద్ద ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఏడుగురు యువకులు ఐస్‌క్రీం తోపుడు బండ్లు తీసుకెళ్లి అమ్మకాలు చేస్తుంటారు.
వారిలో రాజ్‌కుమార్ అనే యువకుడు.. అజిత్‌సింగ్‌నగర్ పోలీసుస్టేషన్‌కు వెనుకవైపున గల వీధిలో ఐస్‌క్రీం విక్రయిస్తున్నాడు. అదే సమయంలో స్థానికంగా నివాసముంటున్న దుర్గాప్రసాద్ అనే యువకుడు.. ఐస్‌క్రీం తనకు ఫ్రీగా ఇవ్వాలని కోరాడు. రాజ్‌కుమార్ ఇవ్వకపోవడంతో బండికి మైక్ బిగించి మా వీధిలోకి ఎందుకు వచ్చావంటూ రాజ్‌కుమార్‌తో గొడవకు దిగాడు. మద్యం మత్తులో ఆవేశంతో దుర్గాప్రసాద్ రెచ్చిపోయాడు.
తన దగ్గరున్న చాకుతో రాజ్‌కుమార్ పొట్టపై గట్టిగా పొడిచాడు. రాజ్‌కుమార్ పెద్దగా అరవడంతో.. దుర్గాప్రసాద్ పరారయ్యాడు. గాయాలపాలైన రాజ్‌కుమార్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. యజమాని రవిప్రసాద్ జరిగిన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్యాయత్నం కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి: