విజయవాడ మేయర్ అభ్యర్థిగా కేశినేని శ్వేతను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. అసమ్మతి నేతలను బుజ్జగించే ప్రక్రియను ఆమె ముమ్మరం చేశారు. పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా సతీమణి సుజాత, ఇతర అభ్యర్థులతో కలిసి విజయవాడ కనకదుర్గమ్మవారిని దర్శించుకుని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో తెదేపా, సీపీఐ అభ్యర్థులను గెలిపించాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు.
తూర్పు నియోజకవర్గంలోని 8వ డివిజన్లో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఓటమి భయంలో అక్రమాలకు పాల్పడేందుకు వైకాపా యత్నిస్తోందని నేతలు ధ్వజమెత్తారు. తెదేపా కార్పొరేటర్ అభ్యర్థి చెన్నుపాటి ఉషారాణి పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. 34వ డివిజన్లో విజయలక్ష్మికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన కేశినేని నానికి మహిళలు సమస్యలు విన్నవించుకున్నారు. నిత్యవసరాల ధరలు పెరగడం కారణంగా దుర్భర జీవితం గడుపుతున్నామని ఓ పారిశుద్ధ్య కార్మికురాలు గోడు వెళ్లబోసుకుంది.
తూర్పు నియోజకవర్గం 17వ డివిజన్లో ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను వైకాపా అభ్యర్థి బహదూర్ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 19వ డివిజన్లో దేవినేని అవినాష్... అభ్యర్థి రెహానా నహీద్ తరఫున ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతుగా తలపెట్టిన రాష్ట్ర బంద్ కారణంగా... తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇవాళ విజయవాడలో నిర్వహించాల్సిన ఎన్నికల ప్రచారాన్ని వాయిదా వేసుకున్నారు.
ఇదీ చదవండీ... 'నన్ను అరెస్టు చేసి ఇబ్బంది పెట్టేందుకు కుట్ర పన్నారు'