బ్యాంకుల ముందు చెత్త వేసిన ఘటనలపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. కారకులైన వారిపై సస్పెన్షన్ వేటు వేసింది. కృష్ణా జిల్లా ఉయ్యూరు మున్సిపల్ కమిషనర్ ప్రకాశ్ రావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను తక్షణం విధుల నుంచి తప్పిస్తున్నట్లు రాష్ట్ర మున్సిపల్ శాఖ కమిషనర్ విజయ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై విచారణ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నామని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఘటనపై విజయవాడ, మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్లను వివరణ కోరారు. ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో జరిగిన ఘటనపై విచారణ జరుగుతోందని అధికారుల తప్పుందని తేలితే తగు చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ బ్యాంకు అధికారుల ప్రతినిధులకు తెలిపారు.
ప్రభుత్వానికి సంబంధం లేదు
బ్యాంకుల ఎదుట చెత్త పారబోసిన ఘటనపై సస్పెండ్‌కు గురైన ఉయ్యూరు కమిషనర్ ప్రకాశ్‌రావు అంతకు ముందు వివరణ ఇచ్చారు. ఘటనలో తనకు ఎలాంటి ప్రమేయం లేదన్నారు. మున్సిపల్ సిబ్బంది, లబ్ధిదారుల చర్యల వల్ల బ్యాంకు సిబ్బంది బాధపడి ఉంటే మన్నించాలని కోరారు. చెత్త వేసిన ఘటన తన దృష్టికి రాగానే వెంటనే తొలగించామన్నారు. చెత్త వేయటంలో ప్రభుత్వానికి, కలెక్టర్‌కు, ఉన్నతాధికారులకు సంబంధం లేదన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు.
ఇదీచదవండి