వైకాపా ప్రభుత్వం దళితులకు చేరువకావడం పట్ల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ భయపడుతున్నారని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ పేర్కొన్నారు. మందకృష్ణకు దళితులపై ప్రేమలేదన్న సురేష్... ఆయన పోరాటాలు తెదేపాకు లబ్ధి చేకూర్చాయని ఆరోపించారు. విజయవాడలోని వైకాపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మందకృష్ణ మాదిగ రాత్రికిరాత్రే హైదరాబాద్ నుంచి వచ్చి ఎందుకు హడావుడి చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ముఖ్యమంత్రి జగన్ దళితులకు చేస్తున్న మంచిని అడ్డుకునేలా మందకృష్ణ తీరు ఉందని ఆక్షేపించారు.
15రోజుల క్రితం జగన్‌ను పొగిడి... ఇప్పుడు తిట్టడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. దళితులకు ఎలా మంచి చెయ్యాలో సీఎం జగన్‌కు తెలుసు అన్న సురేష్... దళితులకు మేలు జరిగితే తన పబ్బం గడవదని మందకృష్ణ ఉలిక్కి పడుతున్నారని విమర్శించారు. సీఎంతో మాట్లాడేందుకు సమయం ఇస్తామన్నా రాకుండా.. గొడవలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సమస్యలు ఉంటే పరిష్కరించుకుందామన్న ఎంపీ... ధర్నాలు, బంద్‌లు వంటి ఆలోచనలు మానుకోవాలని హితవుపలికారు. వర్గీకరణ అనేది కేంద్ర ప్రభుత్వం పరిధిలోని అంశమని స్పష్టం చేశారు. వర్గీకరణ జరిగితే దేశం మొత్తం జరగాలే తప్ప... ఒక్క ఏపీలో ఎలా జరుగుతుందని ప్రశ్నించారు.
ఇదీ చదవండీ...