పంచాయతీ ఎన్నికల ఫలితాల అనంతరం దాడులకు గురైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను విజయవాడ ఎంపీ కేశినేని నాని పరామర్శించారు. అనంతరం నందిగామ నగర పంచాయతీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.
తంగిరాల సౌమ్యను పరామర్శించిన నాని..
కృష్ణా జిల్లా నందిగామలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను.. కేశినేని నాని పరామర్శించారు. ఆదివారం రాత్రి కొంతమంది వ్యక్తులు.. సౌమ్య ఇంటిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఎంపీ అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డికి ఓటేసినందుకు ప్రజలు ఎంతగానో బాధపడుతున్నారని అన్నారు. జగన్ పాలనతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపించారు. ఈ సందర్భంగా రాష్ట్ర డీజీపీ, ఎస్పీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇదే విధంగా వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నాని హెచ్చరించారు.
శెట్టి తిరుపతి కుటుంబాన్ని పరామర్శించిన నాని..
పంచాయతీ ఎన్నికల ఫలితాల అనంతరం తలెత్తిన ఘర్షణలలో గాయపడిన కృష్ణా జిల్లా వత్సవాయి మండలం తాళ్లూరు గ్రామానికి చెందిన శెట్టి తిరుపతి కుటుంబాన్ని ఎంపీ కేశినేని నాని పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులకు సూచించారు. ఓటమిని జీర్ణించుకోలేక వైకాపా నేతలు దాడులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.
ఎన్నికల ప్రచారంలో నాని..
నందిగామ నగర పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఛైర్పర్సన్ అభ్యర్థి శాఖమూరి స్వర్ణలతను గెలిపించాలని కోరుతూ.. 11వ వార్డులోని ఇంటింటికి తిరుగుతూ ఎంపీ కేశినేని నాని ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ఈయనతో పాటు నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీ రామ్ తాతయ్య, తదితరులు పాల్గొన్నారు.