మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు (Motkupalli Narasimhulu) తెరాస తీర్థం పుచ్చుకునే ముహూర్తం ఖరారైంది. సోమవారం ఆయన కారెక్కనున్నారు. మోత్కుపల్లి తెరాసలో చేరే ప్రయత్నాలు గత కొన్నాళ్లుగా కొనసాగుతున్నాయి. దళితబంధుపై తెలంగాణ ముఖ్యమంత్రి (Cm Kcr) నిర్వహించిన సన్నాహక సమావేశాల్లోనూ ఆయన పాల్గొన్నారు. అప్పట్నుంచే తెరాసలో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది.
ఇటీవల శాసనసభలోనూ దళితబంధుపై చర్చ సందర్భంగా మోత్కుపల్లి నర్సింహులు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటే ఉన్నారు. త్వరలోనే ఆయన గులాబీ కండువా కప్పుకుంటారని అందరూ భావించారు. అందుకు అనుగుణంగా సోమవారం ఆయన తెరాసలో చేరనున్నారు. సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు తెలంగాణ భవన్లో జరగనున్న కార్యక్రమంలో మోత్కుపల్లి నర్సింహులు గులాబీ కండువా కప్పుకోనున్నారు.
తెదేపా నుంచి భాజపాలో చేరిన మోత్కుపల్లి.. కొన్ని రోజుల క్రితం ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన అనుభవాన్ని, సుదీర్ఘ రాజకీయ చరిత్రను దృష్టిలో పెట్టుకుని అయినా భాజపాలో సముచిత స్థానం కల్పించలేదని మోత్కుపల్లి గతంలో ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం భాజపా కేంద్ర కమిటీలో ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగానూ అవకాశం ఇవ్వలేదని ఆక్షేపించారు.
మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను పార్టీలో చేర్చుకున్నపుడు తనకు ఒక్కమాట కూడా అడగకపోవడం ఇబ్బందికి గురి చేసిందన్నారు. సీఎం కేసీఆర్ నిర్వహించిన దళిత సాధికారత సమావేశంలో తన అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా ఆహ్వానిస్తే బండి సంజయ్‌కు చెప్పే వెళ్లానని.. అయినా పార్టీలో భిన్నాభిప్రాయాలు రావడం తనను బాధించిందన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో భాజపాకు రాజీనామా చేసిన్నట్లు అప్పట్లో మోత్కుపల్లి ప్రకటించారు. దేశంలోనే దళితులకు పది లక్షలు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన కొనియాడారు. అంబేడ్కర్‌కు నిజమైన వారసుడు కేసీఆరేనని పేర్కొన్నారు. దళిత నేతలంతా కేసీఆర్‌కు మద్దతు తెలపాలని మోత్కుపల్లి నర్సింహులు (Motkupalli Narasimhulu)కోరిన సంగతి తెలిసిందే.