వైకాపా ప్రభుత్వం రెండేళ్ల పాలనలో రాష్ట్రాన్ని నిరుద్యోగాంధ్రప్రదేశ్గా మార్చిందని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ దుయ్యబట్టారు. నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనలు చెవిటివాని ముందు శంఖంలా మారాయన్నారు. నిరుద్యోగులు రోడ్డెక్కి న్యాయం చేయాలని అడుగుతుంటే సంబరాలు చేసుకుంటారా అని నిలదీశారు. ఎన్నికల సమయంలో జగన్ రెడ్డి చెప్పిన మాటలకు నిరుద్యోగులతోపాటు ఉద్యోగులు మోసపోయారని విమర్శించారు.
కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తానని చెప్పి మోసగించారని అనగాని మండిపడ్డారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి కోటిమందిని రోడ్డుకీడ్చారని ధ్వజమెత్తారు. బూటకపు లెక్కలతో విద్యావంతులైన నిరుద్యోగులను మోసగించలేరని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో నిరుద్యోగులే ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.