కృష్ణా పుష్కరాల సమయంలో గత ప్రభుత్వం కూల్చి వేసిన దేవాలయాల పునః నిర్మాణానికి ఈ నెల ఎనిమిదో తేదీన సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. కృష్ణా నదికి సమీపంలో తొమ్మిది ఆలయాలను తొలగించారని... వాటన్నింటినీ సుమారు రెండు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. విజయవాడ నగర పోలీసు కమిషనర్ బి.శ్రీనివాసులు, సంయుక్త కలెక్టరు మాధవీలత, ఇతర అధికారులతో కలిసి మంత్రి వెల్లంపల్లి కృష్ణానది ఒడ్డున గతంలో తొలగించిన ఆలయాల ప్రదేశాలను ప్రత్యక్షంగా పరిశీలించారు.
రాష్ట్రంలో మరో 40 వరకు తొలగించిన, కూల్చివేసిన ఆలయాల పునః నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయం అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, కొండరాళ్లు విరిగిపడకుండా తగిన నివారణ చర్యల కోసం సీఎం రూ. 70 కోట్లు నిధులను మంజూరు చేశారని గుర్తు చేశారు. ఈ పనులకు కూడా ఈనెల ఎనిమిదో తేదీ ఉదయం 11 గంటలకు శంకుస్థాపన చేస్తారని వివరించారు. అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు ఆలయాల విధ్వంసమే ప్రతిపక్ష నేత చంద్రబాబు నైజమని వెల్లంపల్లి విమర్శించారు. రామతీర్థం ఘటనలో బాధ్యులను గుర్తించేందుకు విచారణ కొనసాగుతోందని... త్వరలో నిందితులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇదీ చదవండి