పేదలందరికీ ఇళ్ల పథకంపై గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేశ్.. 26 జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టుకు సిమెంట్, ఇసుక, ఇనుము కొరత లేకుండా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. పేదలకు సొంత ఇల్లు కట్టించాలనే సంకల్పంతో 31 లక్షల మందికి ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు. మొదటి విడతలో 15.6 లక్షల మందికి ఇళ్ల నిర్మాణం జరుగుతోందని.., గృహ నిర్మాణానికి నిధుల కొరత లేదని మంత్రి స్పష్టం చేశారు. పేదల గృహ నిర్మాణాన్ని ఒక బాధ్యతగా తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఈనెల 28న విశాఖలో లక్ష మంది లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 28న రెండవ విడతగా 1.5 లక్షల మహిళలకు ఇళ్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. పేదల ఇళ్లపై కొందరు న్యాయస్థానాలకు వెళ్లి ఆటంకాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. అందరి సొంతింటి కలను తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని మంత్రి రమేశ్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: Grasim Industry: గ్రాసిమ్ పరిశ్రమలో స్థానికులకు 75 శాతం ఉపాధి: జగన్