Dubai Expo: దుబాయ్ ఎక్స్‌పోలో ఇండియా పెవిలియన్ ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి పాల్గొన్నారు. యూఏఈ(UAE)తో భారత్ బంధం రోజురోజుకీ బలోపేతం అవుతోందన్నారు. కొన్నేళ్లుగా పెట్టుబడులను ఆకర్షించేలా పారదర్శకత, డిజిటలైజేషన్, సుస్థిరాభివృద్ధిలో ప్రపంచంతో భారత్ పోటీ పడుతోందన్నారు. దేశంలోని అతిపెద్ద రాష్ట్రాల్లో ఏపీ 8వ స్థానంలో ఉందని.. సహజ వనరులు, అరుదైన ఖనిజ సంపదలకు నెలవైందన్నారు. అవాంతరాలు లేని చౌకైన వాణిజ్యానికి, పెట్టుబడులకు కీలకమైన ప్రాంతమని వివరించారు. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు పోర్టుల నిర్మాణంపై ఏపీ ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు తెలిపారు. విశాఖ-చెన్నై, చెన్నై-బెంగళూరు, హైదరాబాద్-బెంగళూరు వంటి 3 పారిశ్రామిక కారిడార్లున్న రాష్ట్రం ఏపీ అని స్పష్టం చేశారు. భోగాపురంంలో అంతర్జాతీయ విమానాశ్రయం, విశాఖ, అనంతపురం, కాకినాడ, కృష్ణపట్నంలో 4 లాజిస్టిక్ పార్కుల నిర్మాణానికి కార్యాచరణ చేపట్టామన్నారు. తద్వారా చౌకైన సరకు రవాణా వ్యవస్థను నెలకొల్పే ఆలోచన ఉన్నట్లు స్పష్టం చేశారు.
రానున్న రోజుల్లో పెట్టుబడులకు రాష్ట్రం ఎంత ముఖ్యమైన గమ్యస్థానమో వివరించడం. దేశంతో పాటు ప్రపంచ అవసరాలకు సరిపడేలా రాష్ట్రంలోని మానవవనరులకు నైపుణ్యాలు పెంపొందించేలా చేయడమే ఈ ఎక్స్‌పో ప్రధాన ఉద్దేశం. ప్రపంచస్థాయి నైపుణ్యాలు కలిగిన మానవ వనరులను తయారుచేయడం...తద్వారా అంతర్జాతీయ మౌలికవసతుల కల్పనపై... సీఎం దృష్టిసారించారు. రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు రాబడ్డటంతో పాటు సుదీర్ఘమైన సముద్ర తీరం వెంబడి ఆహారరంగ పరిశ్రమల ఏర్పాటుకు ఈ ఎక్స్‌పో నుంచి సహకారం లభిస్తుందని ఆశిస్తున్నాం. భవిష్యత్తు తరాలకు ఇదో బెంచ్ మార్క్‌లా నిలుస్తుందని భావిస్తున్నాం.- మేకపాటి గౌతమ్‌రెడ్డి, మంత్రి
గ్రామ, వార్డు సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాల ఏర్పాటుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల వద్దకు పాలనను ఆచరణలో చేసి చూపిస్తోందని మంత్రి అన్నారు. అపార వనరులు, మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక, వాణిజ్య పరంగా సానుకూల వాతావరణం, నైపుణ్య మానవ వనరులతో ఏపీలో ప్రతి రంగంలో ఊహించని అభివృద్ధి ఉందని.. ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.
ఇదీ చదవండి:
దొంగ డిగ్రీలు చదివిన మీరా.. దొంగ సర్టిఫికెట్ల గురించి మాట్లాడేది? - అయ్యన్నపాత్రుడు