Minimum Pay Scale In Varsity's: విశ్వవిద్యాలయాలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేసే ఒప్పంద ఉద్యోగులకు 11వ పీఆర్సీ ప్రకారం సవరించిన మినిమమ్ టైమ్ స్కేల్ అమలు చేసేందుకు ఈ ఏడాది జనవరి 17న ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు 2015లో సవరించిన వేతనాల ప్రకారం ఎంటీఎస్ అమలుకు 2019 ఫిబ్రవరి 18న ఓసారి, 2021 జూన్ 18న మరోసారి ఆదేశాలిచ్చినా.. క్షేత్రస్థాయిలో మాత్రం అమలు కావడం లేదు. విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులకు ఎంటీఎస్ లేకపోవడంతో ఒక్కో వర్సిటీ ఒక్కోలా వేతనాలిస్తోంది.
జూనియర్, డిగ్రీ కళాశాలల ఒప్పంద ఆచార్యులకు మినిమం టైం స్కేల్ ఇస్తుండగా.. వర్సిటీల్లో మాత్రం సాంకేతిక కారణాలు చూపుతూ ఉత్తర్వులను మూలన పడేశారు. విశ్వవిద్యాలయాలు యూజీసీ 2016 పీఆర్సీ కిందికి వస్తాయని.. 2015 సవరణ పేస్కేల్స్ వర్తించబోవంటూ వర్సిటీలు దాన్ని నిలిపివేశాయి. 2015 పేస్కేల్సే ఇప్పటివరకు అమలు కాకపోగా ఆర్థికశాఖ మాత్రం 11వ పీఆర్సీ ఎంటీఎస్ అమలుకు ఆదేశాలు ఇచ్చేసింది. వీటిని అమలు చేయాలంటే ఉన్నత విద్యామండలి లేదా ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రత్యేకంగా ఆదేశాలివ్వాలని విశ్వవిద్యాలయాలు పేర్కొంటున్నాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో అతి తక్కువగా ద్రవిడ వర్సిటీలో ఒప్పంద అధ్యాపకులకు నెలకు రూ.20 వేలు ఇస్తుండగా, ఆదికవి నన్నయ వర్సిటీలో అత్యధికంగా రూ.41 వేలు చెల్లిస్తున్నారు. కొన్ని వర్సిటీలు టీచింగ్ అసిస్టెంట్, మరికొన్ని అకడమిక్ కన్సల్టెంట్ పేర్లతో నియమిస్తున్నాయి. సహాయ ఆచార్యుడి హోదా వారయినా ఆ పేరుతో నియమించడం లేదు. కేజీబీవీ ఒప్పంద సిబ్బంది సమగ్రశిక్ష అభియాన్ ప్రాజెక్టు పరిధిలోకి వస్తారని.. వీరికి ఎంటీఎస్ వర్తించదంటూ తిరస్కరిస్తున్నారు. ఆర్థికశాఖ మాత్రం ఎంటీఎస్ వర్తింపజేయాలంటూ ఉత్తర్వులిస్తూనే ఉంది. నిధులిస్తే ఇచ్చేందుకు అభ్యంతరం లేదని సమగ్రశిక్ష అభియాన్ పేర్కొంటోంది.
కేజీబీవీల్లో సుమారు 2,600 మంది ఒప్పంద ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. వీరికి ప్రస్తుతం నెలకు 21,755 రూపాయలు ఇస్తున్నారు. ఎంటీఎస్ అమలు చేస్తే నెలకు రూ.44,570 ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెక్కన ప్రతి ఒక్కరూ నెలకు రూ.22,815 నష్టపోతున్నారు. వర్సిటీల్లో ఒప్పంద అధ్యాపకులు 2,100 మంది ఉన్నారు. వీరికి నెలకు రూ.31 వేల నుంచి 41 వేలు ఇస్తున్నారు. వీరందరికీ ఎంటీఎస్ అమలు చేస్తే రూ. 57,700 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఒక్కో ఒప్పంద ఉద్యోగి నెలకు కనీసం రూ.16,700 నుంచి 26,700 వరకు నష్టపోతున్నారు.
ఇవీ చూడండి