Merging of schools: విలీనం పేరుతో 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో కలిపి ప్రాథమిక పాఠశాలలను ముక్కలు చేయొద్దని ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ (ఏపీ సెక్) డిమాండ్ చేసింది. ఈ మేరకు సెక్, ఏపీటీఎఫ్, డీటీఎఫ్, పీడీఎస్‌యూ, ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ నాయకులు ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
విలీన నిర్ణయంపై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో ముందుకెళుతోందని మండిపడ్డారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. నంద్యాల కలెక్టరేట్ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో సెక్ రాష్ట్ర కో కన్వీనర్, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు జి.హృదయరాజు పాల్గొన్నారు.
విలీనం పేరుతో పేద, బడుగు వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం విద్యను దూరం చేస్తోందని హృదయరాజు మండిపడ్డారు. ఆయా జిల్లాల్లో జరిగిన నిరసన కార్యక్రమాల్లో ఉపాధ్యాయ సంఘాల నాయకులు రమేశ్ పట్నాయక్, చిరంజీవి, కృష్ణయ్య, సదాశివరావు, ఏఎస్ నాయుడు, కులశేఖరరెడ్డి, ప్రసాద్, విశ్వనాథరెడ్డి, ధనుంజయరావు తదితరులు ధర్నాల్లో పాల్గొన్నారు.
- అనంతపురంలో నిర్వహించిన ప్రదర్శనలో వందల సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ ర్యాలీలో ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.నరసింహులు, జిల్లా శాఖల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకటేష్, సిరాజుద్దీన్ పాల్గొన్నారు.
- మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయం దగ్గర జరిగిన ధర్నాలో నిరుద్యోగులు పాల్గొన్నారు. డీఎస్సీ నిర్వహించి ఖాళీలను భర్తీ చేయాలని డిమాండు చేశారు. ప్రభుత్వం పాఠశాలల విలీనం పేరుతో 20వేల ఉపాధ్యాయ పోస్టులను రద్దు చేసే ఆలోచన చేస్తోందని ఆరోపించారు.
- పాఠశాలలను విలీనాన్ని నిరసిస్తూ విశాఖలో ధర్నా నిర్వహించారు. విలీన ప్రక్రియ నిలిపేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని ఎమ్మెల్సీ రఘువర్మ తెలిపారు
ఇదీ చూడండి: ఉద్యోగిని భవాని ఆత్మహత్య కేసు.. వైకాపా నాయకుడు, మరో ఇద్దరి అరెస్టు