LOKESH: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలో లోకేశ్ పర్యటించారు. కరోనాతో మృతి చెందిన పార్టీ కార్యకర్తల కుటుంబసభ్యులను పరామర్శించారు. మహిళా కమిషన్ విచారణకు చంద్రబాబు ఎందుకు హాజరు కావాలని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. అత్యాచార బాధితురాలిని పరామర్శించడం తప్పా అని నిలదీశారు. మంత్రుల అవగాహన లేమిని ప్రశ్నించినందుకు విచారణకు రావాలా అని మండిపడ్డారు.
గ్రామస్తులకు కొవ్వొత్తి, అగ్గిపెట్టి, విసనకర్రలు పంచిపెట్టారు. రాష్ట్రంలో మాఫియారాజ్ పాలన నడుస్తోందని లోకేశ్ ఆరోపించారు. పిడుగురాళ్లలో అక్రమంగా నిర్బంధించిన చిన్న పిల్లల వ్యవహారాన్ని జాతీయస్థాయికి తీసుకెళ్తామన్నారు. జగన్ పాదయాత్ర సమయంలో ప్రజలకు 70ఎంఎం రేంజ్లో హామీలు ఇచ్చారని.. అధికారంలోకి వచ్చాక ఒక్క ఎంఎం కూడా పని చేయలేదని ఎద్దేవా చేశారు.
అసలేం జరిగింది: విజయవాడలోని ఆస్పత్రిలో అత్యాచార బాధితురాలిని పరామర్శించేందుకు వెళ్లినప్పుడు తనను అభ్యంతరకర పదజాలంతో దూషించారంటూ తెదేపా అధినేత చంద్రబాబు, బొండా ఉమామహేశ్వరరావులకు రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ నోటీసులు జారీ చేశారు. చంద్రబాబు పేరుతో ఉన్న నోటీసు కాపీని రాష్ట్ర మహిళా కమిషన్ ఉద్యోగులు.. తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఇచ్చారు. మహిళా కమిషన్ కార్యాలయంలో జరిగే విచారణకు రావాలంటూ కమిషన్ జారీ చేసిన నోటీసులను తెదేపా కార్యాలయ సిబ్బంది తీసుకున్నారు. అలాగే.. ఈనెల 27న మహిళా కమిషన్ కార్యాలయంలో విచారణకు రావాలంటూ.. విజయవాడలో బోండా ఉమా ఇంటికి వెళ్లి స్వయంగా నోటీసులు అందచేశారు. అయితే.. నోటీసుల్లో పేర్కొన్న తేదీలపై గందరగోళాన్ని బోండా ఉమా తప్పుబట్టారు. నోటీసులపై న్యాయపరంగా ముందుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు.
మహిళా కమిషన్ అంటే ఏమిటో చూపిస్తాం: అత్యాచార బాధితురాలి పట్ల తెదేపా అధినేత చంద్రబాబు అమానుషంగా వ్యవహరించారని.. అందువల్లనే చంద్రబాబుకు సమన్లు ఇచ్చినట్లు మహిళా కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. అత్యాచారం ఘటనను రాజకీయం చేయడమే కాకుండా విమర్శలు చేయడం దారుణమన్నారు. మహిళా లోకానికి క్షమాపన, సంజాయిషీ ఇప్పించేందుకే కమిషన్ వద్దకు రప్పిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 27న కమిషన్ ముందు చంద్రబాబు వివరణ ఇవ్వాల్సిందేనని... లేనిపక్షంలో మహిళా కమిషన్ అంటే ఏమిటో చూపిస్తామన్నారు. నిన్నటి ఘటనపై తెలుగుదేశం నేతలకు రాజకీయం చేయాలన్న ఆరాటం తప్పా.. సిన్సియారిటీ ఎక్కడా కనిపించలేదని ఆమె విమర్శించారు. అత్యాచార బాధితుల పట్ల రాజకీయ పార్టీలు ఎలా వ్యవహరించాలో తెలుసుకోవాలని.. రాజ్యాంగ వ్యవస్థలు, ప్రజలను గౌరవించడం ఏలాగో నేర్చుకోవాలని హితవు పలికారు.
ఇదీ చదవండి: Arrest: తిరుపతి 'రుయా ఘటన'లో ఆరుగురు అరెస్టు