దిల్లీలో నిరసన తెలుపున్న రైతులపై ప్రభుత్వం జరిపిన నిర్బంధ చర్యలను నిరసిస్తూ విశాఖలో వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. నూతన వ్యవసాయ చట్టాల రద్దుకు డిమాండ్ చేస్తున్న రైతుల మీద, కేంద్రం లాఠీఛార్జీ జరిపించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశాయి. నగరంలోని మద్దిలపాలెం, జగదాంబ జంక్షన్ వంటి పలు ప్రాంతాల్లో కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అన్నదాతలకు న్యాయం చేయకపోతే కేంద్రంలోని భాజపా ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
రైతులను అడ్డుకునేందుకు విశ్వప్రయత్నాలు
న్యాయమైన హక్కుల సాధనకు ఉద్యమిస్తున్న రైతులను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్బంధించడాన్ని సీఐటీయూ తీవ్రంగా ఖండించింది. విశాఖ సీపీఎం కార్యాలయం నుంచి మద్దిలపాలెం ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ వరకు ర్యాలీగావెళ్లి, రాస్తారోకో నిర్వహించింది. రైతులకు నష్టదాయకమైన మూడు వ్యవసాయ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ నర్సింగరావు అన్నారు. దేశవ్యాప్తంగా రైతాంగం ఈ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతోందని స్పష్టం చేశారు.
తమ డిమాండ్ల సాధనకు 500 సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు పంజాబ్, హరియాణ, ఉత్తరప్రదేశ్ రైతులు దిల్లీకి పయనమయ్యారని, వారిని అడ్డుకునేందుకు ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోందన్నారు. దిల్లీ, హరియాణ సరిహద్దులో అన్నదాతల మీద టియర్ గ్యాస్ వినియోగించడం దారుణమని నర్సింగరావు ఆవేదన వ్యక్తం చేశారు. లాఠీఛార్జి చేయడాన్ని ఆయన ఖండించారు. భవిష్యత్తులోనూ కార్మికులు, కర్షకులు కలిసి ఐక్య పోరాటాలు సాగిస్తారని పెట్టుబడిదారీ విధానాన్ని తిప్పికొడతారని ఆయన హెచ్చరించారు.
కంచరపాలెం రైతు బజార్ వద్ద సిపిఎం నిరసన
రైతులను దిల్లీకి రాకుండా అడ్డుకున్నకేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా విశాఖ కంచరపాలెం రైతు బజార్ వద్ద సీపీఎం నిరసన ప్రదర్శన చేపట్టింది. శాంతియుతంగా నిరసన తెలపడానికి వెళుతున్న రైతులపై దాడికి నిరసనగా దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోందని సీపీఎం నాయకుడు అప్పారావు అన్నారు. రైతులను దోపిడీ చేసేందుకు మూడు వ్యవసాయ చట్టాలను తీసుకు వచ్చారని విమర్శించారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటుపరం చేయడానికి 2020 ఎలక్ట్రికల్ చట్టాన్ని మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిందని, ఈ చట్టాలకు రాష్ట్రంలోని వైసీపీ, తెలుగుదేశం పార్టీలు మద్దతు ఇచ్చాయని మండిపడ్డారు.
అనంతపురంలో మానవహారం..
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని దిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులపై లాఠీఛార్జీ చేయడాన్ని నిరసిస్తూ అనంతపురం జిల్లా హిందూపురంలో సీఐటీయూ నాయకులు ర్యాలీ చేపట్టారు. మానవహారం నిర్వహించారు. న్యాయం కోసం పోరాటం చేస్తున్న కర్షకులపై కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడడం దారుణమని అన్నారు.
విజయవాడలో మౌన దీక్ష..
పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో రైతులపై జరిగిన దాడులను ఖండిస్తూ విజయవాడలో సీపీఐ నేతలు మౌన దీక్ష చేపట్టారు. వారికి సీపీఎం మద్దతు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై వామ పక్ష పార్టీలు ఉద్యమం చేస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర రావు అన్నారు. రాష్ట్రంలో నివర్ తుపాను మిగిల్చిన నష్టాన్ని పూడ్చేందుకు కేంద్రం సహకరించాలన్నారు. రైతులకు అండగా వామపక్ష పార్టీలు పోరాడుతునే ఉంటాయని స్పష్టం చేశారు.
కర్నూలు జిల్లాలో ధర్నా..
కేంద్ర ప్రభుత్వం రైతులపై దాడులు జరపడం సరికాదని కర్నూలులో సీఐటీయూ నేతలు ధర్నా చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దిల్లీలో ప్రశాంతంగా నిరసన తెలుపుతున్న అన్నదాతలపై భాష్పవాయువు ఉపయెగించడం ఏమిటని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్ ప్రశ్నించారు. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
శ్రీకాకుళం అంబేడ్కర్ కూడలి వద్ద సీఐటీయూ రాస్తారోకో
దిల్లీలో రైతాంగంపై చేసిన లాఠీచార్జిని ప్రజలంతా ఖండించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు గోవిందరావు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా అంబేడ్కర్ కూడలి వద్ద రాస్తారోకో నిర్వహించారు. నిరసన గళాలను వినిపిస్తున్న రైతులపై తీవ్ర నిర్బంధం, లాఠీచార్జీ, భాష్పవాయువు ప్రయోగించడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. రాస్తారోకోలో పాల్గొన్న సీఐటీయూ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదీ చదవండి: