Mom Contest: 'మాతృత్వం అనేది అందమైన అనుభూతి. గర్భం దాల్చిన నుంచి ప్రసవం వరకు గురయ్యే ఒత్తిడిని జయించేందుకు కిమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో గర్భిణుల కోసం ఐదో సీజన్ మిసెస్ మామ్ కాంటెస్ట్ నిర్వహించారు. త్వరలో తల్లి కాబోతున్న మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు కిమ్స్ కడుల్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని మాదాపూర్ హెచ్ఐసీసీలో నిర్వహించిన ఈ పోటీల్లో గర్భిణీలు ర్యాంప్‌పై క్యాట్‌వాక్ చేసి... ఆకట్టుకున్నారు. పదుల సంఖ్యలో గర్భిణీలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీల కోసం వారం పాటు వివిధ అంశాలపై గర్భిణీలకు కిమ్స్ కడుల్స్ వైద్యనిపుణులు ప్రత్యేక అవగాహన కల్పించారు. ఆరోగ్యం, ఒత్తిడిని జయించడం వంటి అంశాలతో పాటు యోగా శిక్షణ తరగతులు నిర్వహించారు.
గర్భం దాల్చిన మహిళను పువ్వులా చూసుకోవాలి. వాళ్లు ఎంత ఆనందంగా ఉంటే పుట్టబోయే బేబీ కూడా అంత బావుంటుంది. గర్భిణులు వచ్చిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా బాగా అనిపించింది.
-మంచు విష్ణు, 'మా' అధ్యక్షుడు
ఎంతోమందికి మేలు...
Mom Contest: ఈ మిసెస్ మామ్ కాంటెస్ట్‌కు హాజరైన 'మా' అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు, సినీనటి సంజన... నిర్వాహకులను అభినందించారు. గర్భిణీల్లో భయాలను పొగొట్టేందుకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం... ఎంతో మందికి మేలు చేస్తుందని చెప్పారు. ఏటా గర్భిణీలకు అవగాహన కల్పించేందుకు మిసెస్ మామ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు కిమ్స్ ఆసుపత్రి ఎండీ డాక్టర్ భాస్కర్‌రావు తెలిపారు.
ప్రెగ్నెన్సీ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది... మొదటి రోజు నుంచి ప్రసవించేదాకా ఎంత ఆనందంగా ఉండాలనేది వివరించాం. గర్భిణులు ఏయే జాగ్రత్తలు పాటించాలనే అవగాహన కల్పించాం.
-డాక్టర్ భాస్కర్‌రావు, కిమ్స్ ఆసుపత్రి ఎండీ
ఈ మిసెస్ మామ్ పోటీల్లో భాగంగా గైనకాలజీ నిపుణులు శిల్ప వారం పాటు కల్పించిన అవగాహనతో తమలో ఎంతో ఆత్మవిశ్వాసం నింపిందని గర్భిణులు తెలిపారు. ఎప్పుడు లేని అనుభూతిని ఈ కార్యక్రమం ద్వారా పొందినట్లు చెప్పారు.
ఇదీ చదవండి: letters to parents: విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రధానోపాధ్యాయుల లేఖలు