దేశరక్షణ కోసం కర్నల్ సంతోష్‌బాబు ప్రాణత్యాగం చేశారని తెలంగాణ సీఎం కేసీఆర్ కొనియాడారు. వీరమరణం పొందిన కర్నల్ సంతోష్‌బాబు కుటుంబాన్ని సీఎం పరామర్శించారు. సూర్యాపేట విద్యానగర్‌లోని సంతోష్‌బాబు నివాసంలో ఆయన కుటుంబసభ్యులను కలిశారు. అనంతరం సంతోష్‌బాబు చిత్రపటానికి సీఎం నివాళులర్పించారు.
కలచి వేసింది..
కర్నల్ మరణం తనను కలచివేసిందని సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వం సంతోష్ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటుందని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా... తమను సంప్రదించాలని చెప్పారు. సంతోష్ కుటుంబ బాగోగులు చూసుకోవాలని మంత్రి జగదీశ్‌రెడ్డిని ముఖ్యమంత్రి ఆదేశించారు.
రూ. 5కోట్ల చెక్కు..
కర్నల్ భార్య సంతోషికి గ్రూప్-1 ఉద్యోగ నియామక పత్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా అందజేశారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో 711 గజాల స్థలానికి సంబంధించిన పత్రాన్ని సంతోష్ భార్యకు సీఎం అందించారు. కర్నల్ భార్యకు రూ. 4 కోట్ల చెక్కును, తల్లిదండ్రులకు రూ.1 కోటి చెక్కును ముఖ్యమంత్రి అందించగా... రూ.కోటిని మనవరాలు అభిజ్ఞ పేరుపై డిపాజిట్ చేయాలని కర్నల్ తల్లిదండ్రులు కోరారు.
ప్రజాప్రతినిధులు..
సీఎం వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, మంత్రులు జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.