PAWAN KALYAN PROTEST : విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన ఉక్కు పరిరక్షణ దీక్ష ముగిసింది. సాయంత్రం 5 గంటలకు పవన్‌కు నిమ్మరసం ఇచ్చిన జనసేన నేతలు.. దీక్ష విరమింపజేశారు. మరికాసేపట్లో పవన్ ప్రసంగించనున్నారు.
ఉదయం మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉక్కు పరిరక్షణ దీక్ష చేపట్టిన పవన్.. తొలుత తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్, మరో 12మందికి శ్రద్ధాంజలి ఘటిస్తూ మౌనం పాటించారు. అనంతరం.. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించారు. సాయంత్రం ఐదు గంటల వరకు దీక్ష కొనసాగనుంది. అంతకు ముందు గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ శ్రమదానం చేశారు. రహదారులపై ఏర్పడిన గుంతలను పూడ్చారు.
నిర్ణయం వెనక్కి తీసుకోవాల్సిందే..!
విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయడం కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని జనసేన నాయకులు నినదించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రజలు నష్టపోతారని నాదెండ్ల మనోహర్ అన్నారు. ఉక్కు పరిశ్రమ కోసం ఇప్పటివరకు 32 మంది ప్రాణ త్యాగం చేసినట్లు గుర్తు చేసిన నాదెండ్ల.. ఈ విషయంపై తమ అధినేత పవన్ కల్యాణ్.. మిత్రపక్షమైన భాజపా పెద్దలను కలిసి మాట్లాడినట్లు తెలిపారు. తెలుగు ప్రజల కోసం ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలని అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులకు లేఖను అందించినట్లు స్పష్టం చేశారు.
నానాజీ సంచలన వ్యాఖ్యలు..
విశాఖ ఉక్కు ప్రైవేటీకరిస్తే ఏలేరు జలాల తరలింపును అడ్డుకుంటామని జనసేన నేత పంతం నానాజీ హెచ్చరించారు. జాతి విశాల ప్రయోజనాల కోసం ఇప్పటివరకు నీళ్లిస్తున్నామని ప్రైవేటీకరిస్తే తూర్పుగోదావరి జిల్లా రైతులు త్యాగం చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రం నిర్ణయం మార్చుకోవాలని నానాజీ కోరారు.
ఇదీచదవండి: మేడ్చల్ : బౌరంపేటలో ప్రమాదం...ముగ్గురు ఏపీ వాసులు దుర్మరణం