వ్వయసాయం మార్కెటింగ్ అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షకు వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, అగ్రికల్చర్ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కనీస గిట్టుబాటు ధర దొరకని ప్రాంతాల్లో రైతులను ఆదుకునే చర్యలపై సీఎం సమీక్షించారు. వీటికి పరిష్కారం కోసం ఈనెల 30న రైతు భరోసా కేంద్రాలతో పాటు సీఎం యాప్‌ను ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఫాంగేట్ వద్ద ధాన్యం కొనుగోలు సహా రైతుల కోసం ప్రభుత్వం సీఎం యాప్ పేరిట ప్రత్యేకంగా రూపొందించిన కాంప్రహెన్సివ్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్ మెంట్ యాప్‌ను సీఎం జగన్ పరిశీలించారు.
కృష్ణాజిల్లా కంకిపాడు డీసీఎంఎస్ పరిధిలో రైతు నుంచి మొక్కజొన్నను ఆన్లైన్లో కొనుగోలు చేశారు. క్వింటాలు రూ.1760 చొప్పున కనీస మద్దతు ధరతో 57.5 క్వింటాళ్లు కొనుగోలు చేసి రైతు ఆధార్ నెంబర్ ద్వారా లింక్ అయిన బ్యాంకు ఖాతాకు 1లక్ష 1,200 రూపాయలు జమ చేశారు. అనంతరం యాప్‌లో కొన్నిమార్పులు, చేర్పులను జగన్ సూచించారు. సీఎం యాప్‌పై నిరంతర పరిశీలన, పర్యవేక్షణ ద్వారా ఆ విధానాన్ని బలోపేతం చేయాలని, ఎప్పటికప్పుడు వచ్చే సమస్యలను నివారించాలని సీఎం అధికారులను ఆదేశించారు. సీఎం యాప్‌లు విప్లవ్మాతక మార్పులకు శ్రీకారం చుడతాయని అభిప్రాయపడ్డారు.
రైతు భరోసా కేంద్రాలతోపాటు, మార్కెట్ ఇంటెలిజెన్స్, ధరల స్థిరీకరణకోసం సీఎం యాప్ వినియోగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏ గ్రామంలోనైనా పంటలకు ఇబ్బంది ఉందనే సమాచారం తెలియగానే అధికారులు వెంటనే స్పందించాలని సూచించారు. కనీస గిట్టుబాటు ధరకన్నా తక్కువ ధర వస్తుంటే వెంటనే జోక్యంచేసుకుని ఫాంగేట్ వద్దే ధాన్యం కొనుగోళ్లు జరపాలని ఆదేశించారు. పంటలు, వాటి ధరలపై విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్‌లు సమాచారాన్నియాప్ లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ..వెంటనే సంబంధిత జేసీ సహా, అధికారులు వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని సూచించారు. రైతులకు నాణ్యమైన సేవలు అందించడం, సహా వేగంగా సమస్యలు పరిష్కరించాలన్నారు. ధాన్యం ధరలపై మార్కెటింగ్ శాఖ ఎప్పటికప్పుడు పరిశీలన చేయాలని సూచించారు.
రైతుకు గిట్టు బాటు ధర రాకపోతే మార్కెట్లో మళ్లీ ధరల స్థిరీకరణ తీసుకురావాలని .. ప్రభుత్వం నుంచి కనీసం 30 శాతం పంటలను కొనుగోలు చేయాలన్నారు. ఈ లక్ష్యం క్రమేణా గ్రామస్థాయికి చేరాలని స్పష్టం చేశారు. కొన్న ధాన్యానికి ఎన్నిరోజుల్లోగా చెల్లింపులు చేస్తామనే విషయాన్ని రైతులకు స్పష్టంగా చెప్పాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. కనీసం 10 రోజల్లోగా చెల్లింపులు జరిగేలా చూడాలన్నారు. గ్రామస్థాయిలో పంటలను గ్రేడింగ్, సార్టింగ్, ప్యాకింగ్ చేసే సదుపాయాలు కల్పించాలన్నారు. కోల్డ్‌స్టోరేజీలు, గోడౌన్లను గ్రామస్థాయిలో ఏర్పాటు చేయాలని అప్పుడే జనతాబజార్లలో రైతుల నుంచి సేకరించే వస్తువులు నాణ్యంగా ఉంటాయన్నారు. సీఎం యాప్‌పై మండలానికి ముగ్గురు చొప్పున గ్రామ వ్యవసాయ అధికారులకు లకు మాస్టర్ ట్రైనర్లగా శిక్షణ ఇచ్చిన తర్వాత, వారిచేత మిగిలినవారికి శిక్షణ ఇప్పించాలన్నారు. ఈనెల 30న ప్రారంభం కానున్న వైయస్సార్ ఆర్బీకేల వద్ద పంటల కనీస మద్దతు ధరల పట్టిక ఉంచాలని సీఎం ఆదేశించారు.